India Opposition Unites: మోదీ సర్కారుపై ఇండియా కూటమి పోరుబాట
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:55 AM
పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మోదీ సర్కారు వైఫల్యాలపై పోరుబాట పట్టాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి. దేశ భద్రత, రాజకీయ అంశాలపై...
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో.. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, ట్రంప్ వ్యాఖ్యలు సహా 8 అంశాలపై ఫోకస్
న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మోదీ సర్కారు వైఫల్యాలపై పోరుబాట పట్టాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి. దేశ భద్రత, రాజకీయ అంశాలపై ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానించాయి. సోమవారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు జరగనున్న సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమికి చెందిన 24 పార్టీల నేతలు శనివారం రాత్రి వర్చువల్‌గా భేటీ అయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్.. కూటమి నేతలు శరద్‌పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్, ఎంఏ బేబి, డి.రాజా, ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో 8 అంశాలపై మోదీ సర్కారును నిలదీయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ, వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, బిహార్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో జరుగుతున్న ఓటర్ల తొలగింపు, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో దళిత, వెనుకబడిన, గిరిజన, మహిళలు, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న అకృత్యాలతోపాటు అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి అంశాలపై ఉభయ సభల్లో చర్చకు పట్టుబట్టి, మోదీ ప్రభుత్వాన్ని వివరణ కోరాలని నిశ్చయించాయి. దేశ ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా తామంతా ప్రజాస్వామ్యబద్ధంగా సభలో ప్రశ్నిస్తామని, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, మోదీ సర్కారు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నట్లు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News