geopolitical strategy: అమెరికా ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేత
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:50 AM
అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడంపై భారత్ ఆగ్రహంగా ఉందా? అమెరికా నుంచి రక్షణ రంగ
సుంకాల నేపథ్యంలో భారత్ యోచన
తుది దశలో ఉన్న ఒప్పందాలపైనా చర్చలు ఆపేయాలని నిర్ణయం
అందుకే రాజ్‌నాథ్ పర్యటన రద్దు
రాయిటర్స్ కథనం
కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవమన్న రక్షణ శాఖ వర్గాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 8: అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడంపై భారత్ ఆగ్రహంగా ఉందా? అమెరికా నుంచి రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేయాలని భావిస్తోందా? అందుకే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తలపెట్టిన అమెరికా పర్యటన రద్దయిందా?.. ముగ్గురు కీలక అధికారులను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెబుతోంది. దాని ప్రకారం.. అమెరికా నుంచి స్ట్రైకర్ కాంబాట్ వెహికల్స్, ట్యాంక్ విధ్వంసక జావెలిన్ క్షిపణులు, నౌకాదళం కోసం ఆరు బోయింగ్ పీ8ఐ విమానాలు, కొన్ని ఇతర రక్షణ ఉత్పత్తుల కొనుగోలు కోసం భారత్ చర్చలు జరుపుతోందని ఇద్దరు కీల క అధికారులు తెలిపారు. ఈ కొనుగోళ్లను అధికారికంగా ఖరారు చేసి, ప్రకటించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో వాషింగ్టన్‌లో పర్యటించాల్సి ఉందని వెల్లడించారు. అయితే ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఈ కొనుగోళ్లను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు మరో ఉన్నతాధికారి తెలిపారు. సుంకాలను ట్రంప్ ఏ క్షణమైనా వెనక్కి తీసుకోవచ్చని.. దైపాక్షిక సంబంధాలు, సుంకాలపై స్పందన వస్తే రక్షణ కొనుగోళ్లపై యథాతథంగా ముందుకెళ్లవచ్చని వెల్లడించారు. ప్రస్తుతమైతే ఈ పరిస్థితి కనిపించడం లేదన్నారు. వాస్తవానికి ట్రంప్ డిమాండ్ చేస్తున్నట్టుగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించేందుకు భారత్ సిద్ధంగానే ఉంద ని.. రష్యా తరహాలో తక్కువ ధరకు చమురు ఇచ్చే దేశాల కోసం చూస్తోందని ఒక అధికారి చెప్పారు. ట్రంప్ హెచ్చరికలు, సుంకాలతో భారత్‌లో అమెరికా పట్ల వ్యతిరేకత పెరిగిందని.. ఇలాంటి సమయంలో రష్యాను దూరంపెట్టి, అమెరికా వైపు మొగ్గుచూపడం ప్రధాని మోదీకి కత్తిమీద సామేనని పేర్కొన్నారు.
కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది!
ట్రంప్ యంత్రాంగం విధించిన సుంకాల నేపథ్యంలో అమెరికా నుంచి ఆయుధ, రక్షణ కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ భావిస్తోందన్నది తప్పుడు ప్రచారమని రక్షణ శాఖ వర్గాలు తెలిపా యి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వచ్చి న కథనాలు సరికాదని పేర్కొన్నాయి. యూ ఎస్‌ఏ నుంచి వివిధ రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపాయి. కాగా, వాణిజ్య అంశాలకు సంబంధించి ఎవరి ఒత్తిడులకూ భారత్ తలవంచదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు బలమైన దేశమని, ఏటా 6.5శాతానికిపైగా వృద్ధి రేటుతో దూసుకుపోతోందని పేర్కొన్నారు. శుక్రవారం బిజినెస్ టుడే ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. భారత ఆర్థిక మూలాలు, కరెన్సీ, డాలర్ నిల్వలు, స్టాక్ మార్కెట్లు బలంగా ఉన్నాయని చెప్పారు.