Major Agricultural Schemes: రైతన్నకు ధనధాన్యం
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:59 AM
దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, వ్యవసాయ రంగంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వృద్ధిని మెరుగుపరచడమే లక్ష్యంగా......
రూ.35,440 కోట్లతో కేంద్రం 2 పథకాలు
ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
11,440 కోట్లతో పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్
24 వేల కోట్లతో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన
దేశ వ్యాప్తంగా సాగులో వెనుబడిన 100 జిల్లాల్లో పథకం
రబీ సీజన్ నుంచి 2030-31 వరకు 2 పథకాల అమలు
అప్పటికి 350 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం
న్యూఢిల్లీ, అక్టోబరు 11: దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, వ్యవసాయ రంగంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వృద్ధిని మెరుగుపరచడమే లక్ష్యంగా రూ.35,440 కోట్లతో రెండు భారీ వ్యవసాయ పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) పూస క్యాంప్‌సలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఇందుకు వేదికైంది. ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (పీఎం-డీడీకేవై)ను రూ.24వేల కోట్లతో, పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్‌ను రూ.11,440 కోట్లతో ప్రధాని ప్రారంభించారు. అలాగే వ్యవసాయం, పశుసంవర్ధక, చేపల పెంపకం, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన రూ.5,450 కోట్ల ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. దాదాపు రూ.815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు మోదీ ప్రసంగించారు. దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు రైతులు కృషి చేయాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆయన విరుచుకుపడ్డారు. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎలాంటి విజన్, వ్యూహం లేదని, ఫలితంగా వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ (ఏకోసిస్టమ్) బలహీనపడిందన్నారు. కొత్తగా ప్రారంభించిన పథకాల గురించి మాట్లాడుతూ.. పీఎం-డీడీకేవై, పప్పుధాన్యాల మిషన్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుందని, ఇది కోట్లాది మంది రైతుల తలరాతను మార్చుతుందన్నారు. ఈ పథకాలను వచ్చే రబీ (శీతాకాలం) సీజన్ నుంచి 2030-31 వరకు అమలు చేస్తారు. ప్రపంచమార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. మన దిగుమతులను తగ్గించుకోవాలని, ఎగుమతులను పెంచడంలో వెనుకబడవద్దన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుధాన్యాల ఉత్పత్తిదారు, వినియోగదారుగా ఉన్నప్పటికీ భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతోందని ప్రధాని గుర్తు చేశారు. పప్పుధాన్యాల మిషన్‌లో భాగంగా వీటి ఉత్పత్తిని పెంచి స్వయం సమృద్ధిని సాధించడానికి 2030 నాటికి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 252.38 లక్షల టన్నులుగా ఉన్న పప్పు ధాన్యాల దిగుబడిని 2030-31 నాటికి 350 లక్షల టన్నులకు పెంచడం మిషన్ లక్ష్యమన్నారు. ఆశావహ జిల్లాల కార్యక్రమాన్ని అనుసరించి రూపొందించిన పీఎం-డీడీకేవై.. వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుంటుందని, వివిధ మంత్రిత్వ శాఖల్లోని 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నట్టు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మండిపడ్డారు. ఆ నిర్లక్ష్య విధానాన్ని తాను మార్చానని, విత్తనాల నుంచి మార్కెట్ వరకు వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చినట్టు తెలిపారు. గత 11 ఏళ్లలో ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచిందని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఫెర్టిలైజర్‌పై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని, ఇందులో రూ.3.75 లక్షల కోట్లు పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు అందించినట్టు చెప్పారు. కానీ పదేళ్ల యూపీఏ హయాంలో రూ.5 లక్షల కోట్ల సబ్సిడీ మాత్రమే ఇచ్చిందన్నారు. ఇటీవలే వ్యవసాయ యంత్రాలు, విడిభాగాలపై జీఎస్టీ రేట్లను తగ్గించామని, దీంతో రైతులకు రెండింతల ఆదాకు అవకాశం ఏర్పడిందని చెప్పారు.
మోదీని ట్రంప్ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యలు
భారత్‌తో బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుందని, ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని ఆ దేశ రాయబారి సెర్గియో గోర్ చెప్పారు. భారత్‌లో ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్-మోదీ ఉన్న చిత్రపటాన్ని ఆయన ప్రధానికి బహూకరించారు. రక్షణ, వాణిజ్యం, అరుదైన ఖనిజాల గురించి మోదీతో చర్చించినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్, విదేశాంగ కార్యదర్శి మిస్రీతోనూ తాను సమావేశమైనట్లు గోర్ తెలిపారు. గోర్‌తో సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గోర్ హయాంలో భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాల్లో ఘర్షణ నెలకొన్న తరుణంలో గోర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.