Indias HDI Rise: మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి
ABN , Publish Date - May 07 , 2025 | 05:55 AM
మానవాభివృద్ధి సూచీలో భారత్ పురోగతి సాధించి 133వ స్థానం నుంచి 130వ స్థానానికి చేరింది. ఆరోగ్యం, విద్యలో పురోగతి కనిపించినా, లింగ వివక్ష, ఆదాయ అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని ఐరాస నివేదిక వెల్లడించింది
న్యూఢిల్లీ, మే 6: మానవ అభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ) ర్యాంకుల్లో భారత్ పురోగతి సాధించింది. మంగళవారం ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2025 మానవ అభివృద్ధి నివేదిక (హెచ్‌డీఆర్)ను విడుదల చేసింది. ఆ నివేదికలో 193 దేశాలకు సంబంధించి వెల్లడించిన హెచ్‌డీఐ ర్యాంకుల్లో భారత్ 130వ స్థానం సాధించింది. 2022, 2023 మధ్య భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 133 నుంచి 130కి ఎగబాకింది. భారత్‌లో ఆరోగ్యం, విద్యలో అసమానతలు కొంత తొలగినా, ఆదాయం, లింగ వ్యత్యాసాలు ఇంకా కొనసాగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రజల ఆయుర్దాయం 71.7 ఏళ్ల నుంచి 72 సంవత్సరాలకు చేరింది.