Labour Codes: దేశంలో 4 లేబర్ కోడ్స్.. స్వాతంత్ర్యం తరువాత అది పెద్ద కార్మిక సంస్కరణ
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:59 PM
కేంద్రంలోని మోదీ సర్కార్ మరో చారిత్రాత్మక నిర్ణయం చేసింది. దేశంలో కార్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టి కొత్తగా నాలుగు కార్మిక స్మృతులను తీసుకువచ్చింది. దీంతో స్వాతంత్ర్యం తరువాత దేశంలో అది పెద్ద కార్మిక సంక్షేమానికి..
ఢిల్లీ, నవంబర్ 21: స్వాతంత్ర్యం తరువాత అది పెద్ద కార్మిక సంస్కరణకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను (Labour Codes) తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ఇవాళ (శుక్రవారం) ప్రకటించింది.
1. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019(Code on Wages, 2019)
2. శ్రామిక యూనియన్‌లు, ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020(Industrial Relations Code, 2020)
3. సాంఘిక భద్రతా ప్రయోజనాలైన ఇన్స్యూరెన్స్, పీఎఫ్, వైద్యానికి సంబంధించిన కోడ్ 2020 (Code on Social Security, 2020)
4. పని స్థలంలో భద్రత, ఆరోగ్యం, పని షరతుల నియంత్రణ కోడ్ 2020(Occupational Safety, Health & Working Conditions (OSHWC)
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరు, పరిస్థితులకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ చారిత్రక నిర్ణయంతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని ఆయన అన్నారు.
మన దేశంలోని చాలా కార్మిక చట్టాలను 1930ల నుంచి 1950ల మధ్య కాలంలో రూపొందించినట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దాని కంటే పూర్తి భిన్నంగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను మార్చుకున్నాయని, మనం మాత్రం కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతున్నామని ఆయన అన్నారు.
తాజా సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. కొత్త లేబర్ కోడ్‌లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించిందని.. కానీ, వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News