Indirect Imports Ban: వాణిజ్యం బంద్
ABN , Publish Date - May 04 , 2025 | 05:00 AM
పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే అన్ని దిగుమతులను భారత్ పూర్తిగా నిషేధించింది. నౌకాశ్రయాల్లో ప్రవేశం, పాక్ మీదుగా వచ్చే విమానాలకు కూడా అడ్డంకులు విధిస్తూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది.
పాక్ నుంచి అన్నిరకాల దిగుమతులపై భారత్ నిషేధం
ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులన్నింటికీ వర్తిస్తుందని స్పష్టీకరణ
కొరియర్లు, పార్సిల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత
పాక్ నౌకలేవీ భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం
భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపేసిన పాక్
ఇరు దేశాల మధ్య రూ.80 వేల కోట్లకుపైనే వాణిజ్యం
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి అన్నిరకాల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. పాక్‌లో తయారైన, పాక్ నుంచి వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులు ఏవైనా సరే ఈ నిషేధం వర్తిస్తుందని శనివారం స్పష్టం చేసింది. అంతేకాదు ఆ దేశం నుంచి వచ్చే కొరియర్లు, పార్సిళ్లు వంటివాటిని కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు భారత్‌లోని అన్ని నౌకాశ్రయాల్లోకి పాక్‌కు చెందిన, పాక్ జెండా ఉన్న ఎలాంటి నౌకలు ప్రవేశించకూడదంటూ నిషేధం విధించింది. ఇదే సమయంలో భారత నౌకలేవీ కూడా పాకిస్థాన్ పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయిన, ఆ దేశం నుంచి ఎగుమతి చేసే అన్నిరకాల ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతి ఉన్నవైనా, ఎలాంటి అనుమతీ అవసరం లేని ఉత్పత్తులు అయినా ఈ నిషేధం వర్తిస్తుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ నిషేధం నుంచి ఏదైనా మినహాయింపు కావాలంటే.. ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాలి..’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎ్‌ఫటీ) స్పష్టం చేసింది.

జాతీయ భద్రత, ప్రజాప్రయోజనం నిమిత్తం ఈ చర్యలు తీసుకుంటున్నామని, తక్షణమే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే దిగుమతులను నిషేధిస్తూ పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా భారత్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిపోయినట్లైంది.
పరోక్ష దిగుమతులపైనా నిషేధంతో దెబ్బ..
వాస్తవానికి పుల్వామా దాడి తర్వాత పాక్‌తో వాణిజ్యాన్ని భారత్ బాగా తగ్గించుకుంది. చాలా ఉత్పత్తులపై 200ు కస్టమ్స్ సుంకాలు కూడా విధించింది. అయినా పళ్లు, నూనెగింజలు, ఔషధ మొక్కలు, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్, రాగి ఖనిజం, గాజు ఉత్పత్తులు వంటి కొన్నిరకాల ఉత్పత్తుల దిగుమతులు మాత్రం నేరుగా జరుగుతున్నాయి. 2022-23లో భారత్ నుంచి పాక్‌కు సుమారు రూ.5,300 కోట్ల విలువైన ఎగుమతులు జరగ్గా.. పాక్ నుంచి దిగుమతుల విలువ సుమారు రూ.170 కోట్లు. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి పాక్‌కు ఎగుమతులు సుమారు రూ.3,700 కోట్లకు తగ్గిపోతే.. దిగుమతులు కేవలం రూ.4 కోట్లలోపే కావడం గమనార్హం. అయితే ఆంక్షలు, సుంకాల నుంచి తప్పించుకోవడానికి.. పాక్ నుంచి చాలా వరకు ఉత్పత్తులను దుబాయ్, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలకు తరలించి, ఆయా దేశాల ఉత్పత్తులుగా చూపుతూ భారత్‌కు పంపుతుంటారని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఇలా పరోక్షంగా వచ్చే పాక్ ఉత్పత్తుల విలువ సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంటున్నాయి. ఇప్పుడు పాక్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించడంతో.. పాకిస్థాన్‌లోని పలు రకాల పరిశ్రమలకు గట్టి దెబ్బపడుతుందని అంటున్నాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి భారత్-పాకిస్థాన్‌ల మధ్య వాణిజ్యం విలువ రూ.84 వేల కోట్లకు పైనే ఉంటుందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో.. రాగి, రాగి ఉత్పత్తులు, పండ్లు, డ్రైఫ్రూట్స్, పత్తి, హిమాలయాల రాతి ఉప్పు, సల్ఫర్, గ్రానైట్, కొన్నిరకాల ముడి ఖనిజాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉన్ని, గాజు వస్తువులు, తోలు ఉత్పత్తులు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఇక భారత్ నుంచి ముఖ్యంగా మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, కాఫీ, టీ, మసాలాలు, నూనెగింజలు పాక్‌కు ఎగుమతి అవుతాయి.
పాక్ మీదుగా ఆ విమానాలు బంద్!
భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. యూరోపియన్ దేశాల విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా కాకుండా, చుట్టూ తిరిగి భారత్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, స్విస్ ఎయిర్‌వేస్ సంస్థలు తమ విమానాలను మళ్లించి నడుపుతుండగా.. తాజాగా లుఫ్తాన్సా (జర్మనీ), ఐటీఏ ఎయిర్‌వేస్ (ఇటలీ), లాట్ ఎయిర్‌వేస్ (పోలండ్) కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి.
ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా భేటీ పహల్గాం ఘటన తర్వాత తొలిసారి సమావేశం
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తొలిసారి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో 30 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఉగ్రదాడితో పాటు అనంతర పరిస్థితులపై చర్చించారు. ఉగ్రదాడి ఘటన జమ్మూకశ్మీర్ ప్రజల మనస్సులను తీవ్రంగా కలచివేసిందని, హింసకు రాష్ట్ర ప్రజలు వ్యతిరేకమని ఒమర్ ప్రధానికి తెలిపారు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..