Amar Preet Singh: 6 పాక్ యుద్ధ విమానాలుకూల్చేశాం
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:27 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్..
వాటిలో ఎఫ్-16లు కూడా ఉన్నాయి
ఎస్400 గేమ్ చేంజర్.. వైమానిక దళాధిపతి ఏపీ సింగ్
మరి.. హఠాత్తుగా పాక్‌పై యుద్ధం ఎందుకు ఆపేశారు?
ఏ ఒత్తిడి పనిచేసింది?.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ ప్రశ్నలు
ఒక్క విమానాన్నీ కూల్చలే.. భారత్‌ది అసంబద్ధ వాదన: పాక్
భారత్, పాక్ యుద్ధంలో 6 విమానాలు కూలాయి: ట్రంప్
బెంగళూరు, ఆగస్టు 9: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో వాయుసేన కీలక పాత్ర పోషించిందని ఎయిర్‌చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. దాయాది దేశానికి చెందిన ఓ పెద్ద విమానం సహా 6 యుద్ధవిమానాలను నేలకూల్చామని చెప్పారు. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ వైమానిక సామర్థ్యాన్ని దెబ్బతీశామన్నారు. పలు ఎఫ్16ఎస్ యుద్ధ విమానాలను నేలకూల్చడంతోపాటు, ఒక హ్యాంగర్‌ను కూడా ధ్వంసం చేశామని తెలిపారు. అదేవిధంగా ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేసినట్టు వెల్లడించారు. మానవ రహిత వైమానిక వాహనాలు సహా డ్రోన్లు, క్షిపణులను కూడా నేలమట్టం చేశామని, అవి భారత భూభాగంలోనే కూలిపోయాయని తెలిపారు. ప్రధానంగా సుక్కూర్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో యూఏబీ హ్యాంగర్, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వీడియోలను ప్రదర్శించి.. పాక్‌లోని సుక్కూర్ వైమానిక స్థావరం లో దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని వివరించారు. సర్గోధా స్థావరంలోని ఎఫ్-16ఎస్ యుద్ధ విమానాలపై జరిపిన దాడి గురించి వివరిస్తూ.. తన రిటైర్మెంట్‌కు ముందు లభించిన అవకాశంగా పేర్కొన్నా రు. ఇటీవల భారత ప్రభుత్వం సేకరించిన ఎస్-400 రక్షణ వ్యవస్థ గేమ్ చేంజర్ వంటిదన్నారు. పాక్ యుద్ధ విమానాలు, మానవ రహిత విమానాలను ఈ వ్యవస్థ బలంగా ఎదుర్కొంటుందని తెలిపారు. అంతేకాదు.. అసలు భారత వైమానిక రక్షణ వ్యవస్థలోకి పాక్ చొరబడే అవకాశం కూడా ఉండదన్నారు.
సీడీఎ్‌సతో అనేక మార్పులు
సైనిక కార్యకలాపాలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవి అనేక మార్పులు తీసుకువచ్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. సీడీఎస్ అన్ని వేళలా అందుబాటులో ఉండి.. తమకు ఎన్నో సూచనలు చేస్తున్నారన్నారు. అనేక విషయాలను కలిసి చర్చించినట్టు తెలిపారు. అదేవిధంగా ‘ఆపరేషన్ సిందూర్’లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. భద్రతా దళాలు, ఇతర ఏజెన్సీలు సంయుక్తంగా ముందుకు నడిచేందుకు దోహద పడ్డారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక శక్తి సామర్థ్యం అందరికీ తెలిసిందన్నారు.
అందుకే స్వేచ్ఛగా..!
‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో కేంద్రం సుస్పష్టమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించిందని అమ ర్ ప్రీత్ సింగ్ అన్నారు. అందుకే ఆపరేషన్ విజయవంతమైందన్నారు. వైమానికదళంపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, తాము స్వేచ్ఛగా పని పూర్తి చేశామన్నారు. ‘‘సైనిక దళాలపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మేం స్వేచ్ఛగా వ్యవహరించాం. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నాం. పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నాం. రాజకీయ సంకల్పం సుస్పష్టంగా ఉండడం మరింత కలిసి వచ్చింది. అందుకే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది’’ అని అన్నారు.
ఏ ఒత్తిడి పనిచేసింది?: కాంగ్రెస్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చెప్పిన విషయంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెబుతున్న సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు అంత హఠాత్తుగా నిలుపుదల చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సహా, లోక్‌సభలో విపక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘‘ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించిన కొత్త విషయం.. దిగ్ర్భాంతికి గురిచేసింది. హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపేశారు. ఎక్కడ నుంచి ఒత్తిడి వచ్చింది? ’’ అని ప్రశ్నించారు.
ఒక్క విమానాన్నీ కూల్చలేదు
భారత్‌ది అసంబద్ధ వాదన: పాక్
‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు చెందిన ఆరు విమానాలను కూల్చివేశామన్న భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తోసిపుచ్చారు. ఆ వాదనలో పసలేదని, అదొక అకాల, అసంబద్ధమైన వాదనని ఎదురు దాడి చేశారు. తాము ఒక్క విమానాన్నీ నష్టపోలేదంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. స్వ తంత్ర ధ్రువీకరణ కోసం ఇరు దేశాల విమానాల జాబితాను బహిరంగ పరుద్దామని సలహా ఇచ్చా రు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.