Share News

Rahul Gandhi: ఓట్‌ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:00 AM

దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందన్న

Rahul Gandhi: ఓట్‌ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం

  • జయప్రకాశ్‌ నారాయణ్‌ ‘సంపూర్ణ విప్లవం’ స్థాయిలో నిర్మాణానికి ‘ఇండియా’ యోచన

  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన..రాహుల్‌ గాంధీ ‘ఓట్‌ చోరీ’ ప్రజెంటేషన్‌

  • బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు

  • ఓటరుకార్డు-ఆధార్‌ అనుసంధానంతో బోగస్‌ ఓట్లకు చెక్‌పడుతుంది: ఈసీ వర్గాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానం, దాని పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓటర్ల జాబితా ఆధారంగా ఆయన ఇచ్చిన ‘ఓట్‌ చోరీ’ ప్రజెంటేషన్‌కు మంచి స్పందన వచ్చిందని ఇండి కూటమి భావిస్తోంది. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, బీజేపీని ఎండగట్టేందుకు సిద్ధమైంది. గతంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ నిర్మించిన ‘సంపూర్ణ విప్లవం’ ఉద్యమం తరహాలో దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనను లేవనెత్తాలని ఇండి కూటమి నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, ఎన్నికలు జరగనున్న బిహార్‌లో దూకుడుగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. గురువారం సాయంత్రం రాహుల్‌ నివాసంలో విందు భేటీలో పాల్గొన్న కూటమి నేతలంతా.. ఎన్నికల సంఘంపై రాహుల్‌ దాడి తీరును ప్రశంసించినట్టు తెలిసింది.

ప్రజల్లోకి వెళ్తే బీజేపీకి నష్టమే?

రాహుల్‌ చేసిన ఆరోపణలు విపరీతంగా ప్రజల్లోకి వెళ్లడం, సాధారణ ప్రజలు దీనిపై మాట్లాడుకోవడం, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం లభించడంపై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌ ఆరోపణలు ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపినా.. బీజేపీ పట్ల వ్యతిరేకతగా మారే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. 2జీ కుంభకోణంతో నష్టం కేవలం ఊహాత్మకమేనని అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు వాదించినా... కాంగ్రెస్‌ వేలకోట్ల అవినీతికి పాల్పడినట్టు ప్రజల్లోకి వెళ్లిందని, అది బీజేపీకి అనుకూలంగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఓట్ల చోరీ చేయకపోయినా.. ప్రజల్లో ఆ అభిప్రాయం కలిగించడంలో కాంగ్రెస్‌ సఫలమైతే బీజేపీ దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

లోపాలు సాధారణమే.. చర్చే అసాధారణం..

రాహుల్‌ ఆరోపణలు, ప్రజెంటేషన్‌పై ప్రభుత్వవర్గాల్లో, మంత్రిత్వ కార్యాలయాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. నిజానికి రాహుల్‌ లేవనెత్తిన అంశాలు.. దేశవ్యాప్తంగా స్థానికంగా జరుగుతున్నవేనని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంటి నంబర్లు సరిగా ఉండవని, అధికారులు ఏదో ఒకటి రాసుకుంటారని, దాన్ని బట్టి బీజేపీతో ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కైనట్లు భావించలేమని స్పష్టంచేశారు. కానీ ఈ అంశాన్ని సరైన సమయంలో లేవనెత్తడం, బాగా ప్రజెంటేషన్‌ చేయడంతో ఎన్నికల సంఘం, బీజేపీ విశ్వసనీయతపై సందేహాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రాహుల్‌ చెప్పినట్టు బోగస్‌ ఓట్లు పడ్డాయా అనేది ఎన్నికల్లో పార్టీ ఏజెంట్లు టిక్‌ చేసిన ఓటర్ల జాబితాలను చూస్తే వెల్లడవుతుందని, కానీ అదంతా జరిగి ఉండే అవకాశం లేదని చెప్పారు.


ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించాలి

రాహుల్‌ ఆరోపణలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే.. ప్రధానమంత్రి ముందుకొచ్చి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించాలని ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను పునరుద్ధరించాలంటే కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మోదీ ముందుకు రావాలన్నారు.

ఓటరుకార్డు-ఆధార్‌ అనుసంధానంతో పరిష్కారం!

ఓటరుకార్డును ఆధార్‌తో అనుసంధానం చేస్తే బోగస్‌, డూప్లికేట్‌ ఓట్ల సమస్యకు చెక్‌ పడుతుందని ఎన్నికల కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ నుంచి పంచాయతీల వరకు ఒకే ఓటర్ల జాబితాను అనురించడంతోనూ ప్రయోజనం ఉంటుందని అంటున్నాయి. ఇక దేశంలో పౌరులకు అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఒకే కార్డును జారీ చేయాలనే ప్రతిపాదనపై చాలా రోజులుగా చర్చ జరుగుతోందని.. అది అమల్లోకి వస్తే ఓట్ల సమస్య తీరుతుందని స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Aug 09 , 2025 | 05:00 AM