Agniveer: ఏటా లక్ష మంది అగ్నివీరులుగా అవకాశం..!
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:29 PM
త్రివిధ దళాల్లో భారీగా బలగాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో భారీగా నియామకాలు చేపట్టేందుకు భారత సైతం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏడాదికి దాదాపు లక్ష మందిని వరకు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 26: త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 50 వేల మందిని నియమిస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకు పెంచే ఆలోచనలో భారత సైన్యం ఉన్నట్లు సమాచారం. కరోనా సమయంలో నియామకాలు నిలిపివేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఈ సమయంలో దాదాపు 65 వేల మంది సైనికులు పదవీ విరమణ చేశారు. 2022లో అగ్నిపథ్ పథకం ప్రారంభమైంది. భారీ స్థాయిలో నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 1.75 లక్షల మంది అగ్నివీరలను నియమించారని గణాంకాలు చెబుతున్నాయి.
గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే.. 2023లో త్రివిద దళాల్లో 1.55 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదీకాక సైన్యంలో ఏటా పదవీ విరమణలకు, నియామకాలకు మధ్య వ్యత్యాసం ఉండడంతో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 1. 8 లక్షల ఖాళీలు ఏర్పడినట్లు అంచనా. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే త్రివిధ దళాల ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు జాతీయ మీడియా వెల్లడిస్తుంది.