Impeachment on Justice Yashwant Varma: అభిశంసన ప్రక్రియ షురూ
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:11 AM
నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. ...
జస్టిస్ వర్మ తొలగింపు అంశంలో ముగ్గురితో కమిటీ వేసిన లోక్‌సభ స్పీకర్
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలి మచ్చలేని వ్యక్తిత్వం, నిజాయితీలే పునాది
అవినీతికి వ్యతిరేకంగా యావత్ దేశం, పార్లమెంటు ఒక్కటవ్వాలి: ఓంబిర్లా
న్యూఢిల్లీ, ఆగస్టు 12 : నివాసంలో భారీగా నగదు బయటపడిన వ్యవహారంలో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరపడానికి ముగ్గురు సభ్యులతో ఆయన ఒక కమిటీని నియమించారు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం - 1968లోని సెక్షన్ 3(2) కింద ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మణింద్రమోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మను బాధ్యతల నుంచి తప్పించాలంటూ లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 146 మంది ఎంపీల నుంచి గత నెల 21న నోటీసులను స్పీకర్ స్వీకరించారు. మంగళవారం దీనిపై కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ‘‘కమిటీ వీలైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది. విచారణ కమిటీ రిపోర్టు చేతికి వచ్చేవరకు జస్టిస్ వర్మ తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనన పెండింగ్‌లో ఉంటుంది.’’ అని ఓంబిర్లా తెలిపారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం నిలబడాలని, మచ్చలేని వ్యక్తిత్వం, ఆర్థిక, మేధోపరమైన సమగ్రతే ఇందుకు పునాది అని వ్యాఖ్యానించారు. ‘‘న్యాయమూర్తిపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 ప్రకారం చర్యలకు వీలున్నది. అవినీతిపై పార్లమెంటు, దేశ ప్రజలు ఒక్కటవ్వాలి..’’ అని ఓంబిర్లా పిలుపునిచ్చారు.