IMD Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 12 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:32 AM
దేశవ్యాప్తంగా వాతావరణం మళ్లీ మారింది. దీంతో ఆగస్టు 12 వరకు మళ్లీ వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ దంచికొట్టనున్నాయి. అయితే ఈ ప్రభావం ఎక్కడెక్కడ ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశంలో వర్షాల వెదర్ మళ్లీ మారింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Alert) తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఆగస్ట్ 8 నుంచి 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
దీంతోపాటు ఆగస్ట్ 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆగస్ట్ 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అక్కడి చాలా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
ఈ జిల్లాల్లో భారీ వర్షం
ఇదే సమయంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నాటకలో బెంగళూరు రూరల్, తుమకూరు, చిత్రదుర్గ, దవనగెరె, కోప్పల్, బాగలకోట్, బెల్గాం వంటి జిల్లాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో కూడా..
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రానున్న రెండు వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అందుకే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెదర్ రిపోర్ట్ తెలిపింది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో భారీ నష్టం..
ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశి జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాలలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వర్షాలతో కొండలపై నుంచి కొట్టుకువచ్చిన నీరు, మట్టితో అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వారణాసి, ప్రయాగరాజ్ వంటి ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి