Share News

Delhi Bungalow Case: ఐఏఎస్‌కు షాక్.. రూ.1.63 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:44 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి అనూహ్య పరిణామం ఎదురైంది. న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు రూ.1.63 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

Delhi Bungalow Case: ఐఏఎస్‌కు షాక్.. రూ.1.63 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..

న్యూఢిల్లీ, అక్టోబర్ 08: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మహిళా ఐఏఎస్ అధికారినికి అనూహ్య పరిణామం ఎదురైంది. న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు రూ.1.63 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ మహిళా అధికారి పేరు దుర్గా శక్తి నాగ్‌పాల్. ఈమె లఖీంపూర్ ఖేరి జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2010 బ్యాచ్ కు చెందిన దుర్గా శక్తి నాగ్‌పాల్.. 2015 మార్చి 19న వ్యవసాయ మంత్రిగా ఉన్న రాధా మోహన్ సింగ్‌కు ఓఎస్డీ (Officer on Special Duty)గా నియామకమయ్యారు. దీంతో ఆమె ఉండేందుకు నివాస స్థలంగా న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్‌లో ఉన్న B 17 బంగ్లాను కేటాయించారు. 2015 ఏప్రిల్ 16న నెలకు రూ.6,600 అద్దె చెల్లిస్తూ బంగ్లాను దుర్గా శక్తి తీసుకున్నారు.


వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఆమెకు డిప్యూటేషన్ 2019 మే 7న ముగిసింది. అప్పుడే ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉండగా చేయలేదు. ఆ తర్వాత ఆమె కామర్స్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ అదే బంగ్లాలో కొనసాగారు. కొంత కాలం తరువాత 2025 ఫిబ్రవరిలో ఐఏఆర్ఐ అధికారులు ఢిల్లీ పోలీసుల సహాయంతో బంగ్లా ఖాళీ చేయించారు. అన్ని గణాంకాలు పరిశీలించిన అధికారులు.. 2022 మే నుంచి 2025 ఫిబ్రవరి వరకు అనధికారికంగా ఆమె అక్కడ ఉన్నారని పేర్కొన్నారు. దీని కోసం రూ.1.63 కోట్ల పరిహారం చెల్లించాలని ఐఏఆర్ఐ నోటీసులు జారీ చేసింది.


ఐఏఆర్ఐ నోటీసులపై ఐఏఎస్ అధికారి దుర్గా శక్తి నాగ్‌పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను మంత్రిత్వ శాఖను సంప్రదించి పొడిగింపు కోరానని చెప్పుకొచ్చారు. దీని కోసం అద్దె కూడా చెల్లించానని చెప్పారు. కొన్ని డాక్యుమెంటేషన్ లోపాల వల్ల అధికారులు భారీ జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనధికారికంగా బంగ్లాలో ఉన్నా అనేది అవాస్తవమని, అన్యాయమైనదని అన్నారు. జరిమానా మాఫీ చేయాలని కోరుతూ అధికారులను అభ్యర్థించినట్లు చెప్పుకొచ్చారు. అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రిత్వ శాఖకు లేఖ రాసి 2025 జూన్ 26న మాఫీ కోరిన విషయం తెలిసిందే.


Also Read:

Success Tips: జీవితంలో విజయం సాధించాలంటే ఈ అలవాట్లను మార్చుకోండి.!

Konaseema Fire Accident: ఘోరం... బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు

Updated Date - Oct 08 , 2025 | 03:25 PM