India-China Flights: నాలుగేళ్ల తర్వాత చైనాకు విమాన సర్వీసులు.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - Aug 12 , 2025 | 09:44 PM
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 2020లో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్చలు కొనసాగుతుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. చైనాకు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండమని ఎయిరిండియా, ఇండిగో సంస్థలకు భారత ప్రభుత్వం సూచించినట్టు 'రాయిటర్స్' వార్తా సంస్థ తెలిపింది. దీంతో నాలుగేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య విమాన సర్వీసులను తిరిగి పునరుద్ధించినట్టు అవుతుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్‌కు వచ్చే విమాన సర్వీసులను నిలిపివేసింది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 2020లో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే కొద్దికాలంగా పలుమార్లు ఇరు దేశాల మిటటరీ, దౌత్య చర్చల్లో పురోగతి కనిపించింది. తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, డెమ్‌చోక్ నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకారానికి వచ్చాయి. అక్టోబర్ 30న బలగాల వెనక్కు మళ్లడం పూర్తయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ద్వితీయార్థంలో టియాంజిన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరుకానున్నారు. 2019 తర్వాత చైనాలో మోదీ పర్యటించడం ఇదే ప్రథమం అవుతుంది. మోదీ పర్యటనను చైనా స్వాగతించింది. షాంఘై సదస్సు సంఘీభావం, మైత్రీసంబంధాలను మెరుగుపరిచి సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రూ.5,801 కోట్లతో లక్నో మెట్రో ఫేజ్-1Bకి కేంద్రం ఆమోదం
పాక్ ఎంబసీకి వార్తాపత్రికలు నిలిపివేత
For More National News and Telugu News