Goa CM: ప్రభుత్వ డాక్టర్‌కు ఊరట.. సీఎం జోక్యంతో తప్పిన సస్పెన్షన్ ముప్పు
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:59 PM
గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్ రాణె ఆగ్రహానికి గురైన ప్రభుత్వ డాక్టర్ రుద్రేశ్‌కు ఊరట లభించింది. సీఎం ప్రమోద్ సావంత్ జోక్యంతో ఆయనకు సస్పెన్షన్ ముప్పు తప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: గోవా ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్ రాణె ఆగ్రహానికి గురైన ప్రభుత్వ డాక్టర్ రుద్రేశ్‌కు ఊరట లభించింది. సీఎం ప్రమోద్ సావంత్ జోక్యంతో ఆయనకు సస్పెన్షన్ ముప్పు తప్పింది. డా. రుద్రేశ్‌ను సస్పెండ్ చేయబోమని సీఎం ఆదివారం పేర్కొన్నారు. ‘డా.రుద్రేశ్ కుట్టికార్‌ను సస్పెండ్ చేయబోమని గోవా ప్రజలకు భరోసా ఇస్తున్నాను’ అని సీఎం తెలిపారు. ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం, మెడికల్ టీమ్ కట్టుబడి ఉందని అన్నారు. ప్రజల జీవితాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
డా.రుద్రేశ్ కుట్టికార్ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ ఆ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలకు వచ్చారు. ఓ వైద్యుడు పేషెంట్‌లకు అందుబాటులో ఉండేందుకు నిరాకరించారన్న ఫిర్యాదు అందడంతో మంత్రి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డా.రుద్రేశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీరు నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీరు డాక్టర్. సాధారణంగా నాకు కోపం రాదు. మీరు మాత్రం ప్రవర్తన నియంత్రించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పేషెంట్లతో మర్యాదగా నడుచుకోవాలి’ అని అన్నారు. ఆ తరువాత ఆసుపత్రి సూపరింటెండెంట్ వైపు చూస్తూ.. ‘ఆయన స్థానంలో మరో సీఎమ్ఓను నియమించండి. ఆయన సస్పెన్షన్ ఫైలుపై నేను సైన్ చేస్తాను. వెంటనే ఆయన సస్పెండ్ కావాలి. ఇలా నేను ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడింది లేదు. కానీ దీన్ని మాత్రం సహించను’ అని మంత్రి ఆదేశించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రిపై గోవా పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి తన అధికారదర్పం ప్రదర్శించారని, ఇది తలవంపులు తెచ్చే ఘటన అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే జోక్యం చేసుకున్న గోవా సీఎం.. డాక్టర్‌ను సస్పెండ్ చేయట్లేదని తాజాగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..
ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేసిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి