Share News

Healthcare Shortage: భారతీయ నర్సుల విదేశీ బాట

ABN , Publish Date - May 27 , 2025 | 05:03 AM

ప్రపంచంలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉండగా, భారత్‌లో నర్సుల సంఖ్య డబ్ల్యూహెచ్‌వో సూచించిన స్థాయికి తగ్గట్లుగా ఉంది. మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కోసం భారతీయ నర్సులు జర్మనీ, ఐర్లాండ్‌, యూఏఈ వంటి దేశాలకు వెళ్తున్నారు, దీని వల్ల దేశంలో నర్సుల కొరత మరింత పెరుగుతోంది.

Healthcare Shortage: భారతీయ నర్సుల విదేశీ బాట

అధిక వేతనాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న హెల్త్‌కేర్‌ నిపుణులు

న్యూఢిల్లీ, మే 26: ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్‌ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫారసుల ప్రకారం ప్రతి వెయ్యి మంది ప్రజలకు ముగ్గురు నర్సులు ఉండాలని చెబుతుంటే.. భారత్‌లో మాత్రం కేవలం 1.96 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న హెల్త్‌కేర్‌ నిపుణుల కొరతను ఉపయోగించుకుంటూ.. భారత్‌లోని నర్సులు అధిక జీతం, మెరుగైన పని పరిస్థితులను కోరుకుంటూ విదేశాల బాట పడుతున్నారు. ఈ సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంది. జర్మనీ, ఐర్లాండ్‌, మాల్టా, యూఏఈ, బెల్జియం వంటి దేశాలకు వెళ్తున్నారు. ఆయా దేశాలు పోటీపడి మరీ అధిక వేతనాలు, ఇతర అదనపు ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తూ వారిని నియమించుకుంటున్నాయి. ‘బోర్డర్‌ప్లస్‌’ అనే వర్క్‌ఫోర్స్‌ మొబిలిటీ సంస్థ డాటా ప్రకారం.. జర్మనీలో కొత్తగా నియామకమైన ఒక నర్సు నెలకు 2,700 యూరోల (సుమారు రూ.2.6 లక్షలు) జీతాన్ని ఆశించవచ్చు. లైసెన్స్‌ పొందిన తర్వాత రూ.3.2 లక్షల వరకు పోయే అవకాశం ఉంది. అదే భారత్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే నర్సులకు వేతనం రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంటుంది. ఐర్లాండ్‌ రూ.1.7 లక్షలు-రూ.2.5 లక్షల వేతనాన్ని ఆఫర్‌ చేస్తోంది. యూఏఈలో ప్రారంభ వేతనం రూ.75 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంది. దీంతో పాటు ఆదాయం పన్ను రాయితీ, ఇతర ప్రయోజనాలను కల్పిస్తోంది.


విదేశాల్లో భారతీయ నర్సులకు డిమాండ్‌

మెరుగైన వైద్య నైపుణ్యాలు, ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యం, ఎక్కడికైనా వెళ్లేందుకు సమ్మతి వంటి అంశాలతో భారతీయ నర్సులకు ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. క్రిటికల్‌ కేర్‌, జెరియాట్రిక్స్‌ (వృద్ధుల ఆరోగ్య సంరక్షణ), ప్రినేటల్‌ (ప్రసవానికి ముందు) సేవల్లో మనవాళ్లకు అధిక డిమాండ్‌ ఉంది. అయితే, నర్సులు విదేశాలకు వెళ్లడం దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన నర్సుల సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. నర్సుల వలసలు ఈ కొరతను మరింత పెంచుతాయి. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ నైపుణ్యాన్ని దేశంలోనే నిలుపుకోవడానికి దేశీయంగా పని పరిస్థితులను మెరుగుపరచడం, పోటీ వేతనాలు ఆఫర్‌ చేయడం, శిక్షణా సదుపాయాలను విస్తరించడం వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:03 AM