Share News

GATE 2026 : గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:35 PM

గేట్‌ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. ఐఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు, పీహెచ్‌డీలో ప్రవేశాలకు..

GATE 2026 : గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
GATE 2026 Exam Dates

ఇంటర్నెట్‌ డెస్క్‌: గేట్ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్షకు అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ కాకపోయినప్పటికీ తేదీలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఐఐటీ గువాహటి ప్రకటించింది. ఈ వివరాలను కొత్తగా డిజైన్‌ చేసిన గేట్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 6 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు.


ఇక, అప్లికేషన్ కోసం ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే.. రూ. 1,000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ. 2000 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రిఫండ్‌ చేయరు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో (శని, ఆదివారాల్లో) దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో గేట్‌ పరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల పాటు పూర్తిగా ఆన్ లైన్లో ఈ ఎగ్జామ్ జరగనుంది. ఫలితాలు మార్చి 19న విడుదల చేస్తారు.

Gate-2026-exam-schedule.jpg


దేశంలోని ఐఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు. గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఐఐటీలు గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. పూర్తి వివరాలు gate2026.iitg.ac.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Updated Date - Aug 06 , 2025 | 05:47 PM