Share News

Pune: తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్‌కు..

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:14 AM

తండ్రికి చెప్పకుండా స్నేహితులతో బ్యాంకాక్‌ ట్రిప్‌ వేసిన ఓ మాజీ మంత్రి పుత్రరత్నం పథకం బెడిసికొట్టింది. పుణె నుంచి టేకాఫ్‌ అయిన అతని చార్టర్డ్‌ విమానం.. అండమాన్‌ దాకా వెళ్లి, మళ్లీ పుణెలోనే ల్యాండ్‌ అయ్యింది.

Pune: తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్‌కు..

  • కొడుకు కిడ్నాప్‌ అయ్యాడన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి

  • మహారాష్ట్రలోని పుణెలో ఘటన.. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, శిందే వర్గం ఎమ్మెల్యే

పుణె, ఫిబ్రవరి 13: తండ్రికి చెప్పకుండా స్నేహితులతో బ్యాంకాక్‌ ట్రిప్‌ వేసిన ఓ మాజీ మంత్రి పుత్రరత్నం పథకం బెడిసికొట్టింది. పుణె నుంచి టేకాఫ్‌ అయిన అతని చార్టర్డ్‌ విమానం.. అండమాన్‌ దాకా వెళ్లి, మళ్లీ పుణెలోనే ల్యాండ్‌ అయ్యింది. సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ హైడ్రామా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన(శిందేవర్గం) ఎమ్మెల్యే తానాజీ సావంత్‌ కుమారుడు రిషిరాజ్‌ సోమవారం రాత్రి తన ఇద్దరు మిత్రులతో కలిసి చార్టెడ్‌ విమానంలో బ్యాంకాక్‌ బయలుదేరాడు. ఆ విమానం అండమాన్‌ సమీపంలో ఉండగా.. తానాజీ తన కుమారుడు అపహరణకు గురయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ హైడ్రామాను చార్టెడ్‌ విమాన సేవలను అందిస్తున్న సంస్థ వివరించింది.


‘‘రిషిరాజ్‌ కిడ్నాప్‌ అయ్యాడంటూ మాకు అతని కుటుంబ సభ్యుల నుంచి ఫోన్‌ వచ్చింది. మేం నమ్మలేదు. ఇది ఆకతాయి ఫోన్‌కాల్‌ అనుకున్నాం. ఆ తర్వాత పోలీసు కేసు అయ్యిందంటూ డీజీసీఏ, పౌరవిమానయాన శాఖలు ధ్రువీకరించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాం’’ అని వెల్లడించింది. మెడికల్‌ ఎమర్జెన్సీ, సాంకేతిక లోపాలు ఎదురైన సమయంలో ఇలా విమానాలను వెనక్కి మళ్లిస్తామని, పోలీసు కేసు కారణంగా తొలిసారి వెనక్కి రప్పించామని పేర్కొంది. ‘‘విషయం ప్రయాణికులకు తెలియకూడదు. అందుకే మా పైలట్లు, సిబ్బంది రిషిరాజ్‌, అతని మిత్రులకు చెప్పలేదు. వారి సీట్ల ముందుండే నావిగేషన్‌ వ్యవస్థను ఆపేశాం. విమానం పుణెలో ల్యాండ్‌ అయ్యే వరకూ వారికి విషయం తెలియదు. విమానం ల్యాండ్‌ అవ్వగానే.. సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది వారిని వెంట తీసుకెళ్లారు’’ అని తెలిపింది. నిజానికి రిషిరాజ్‌ ట్రిప్‌ గురించి అతని ఇంట్లో తెలియదు. రిషిరాజ్‌ కిడ్నాప్‌ జరిగిందంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేయడంతో.. ఈ హైడ్రామా జరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 14 , 2025 | 05:14 AM