Kumbh Mela: కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:17 AM
సెక్టార్-22 వెలుపల చమన్‌గంజ్ చౌకీ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 15 గుడారాలు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

15 గుడారాలు దగ్ధం.. తప్పిన ప్రాణనష్టం
బుధవారం నాటి తొక్కిసలాట నేపథ్యంలో
వాహనాల రాకపోకలపై నిషేధం
వీవీఐపీ పాస్‌లు రద్దు చేసిన యోగి సర్కారు
మహాకుంభ్ నగర్, జనవరి 30: ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్-22 వెలుపల చమన్‌గంజ్ చౌకీ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 15 గుడారాలు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో టెంట్ల లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైన తర్వాత జరిగిన మూడో అగ్నిప్రమాదం ఇది. జనవరి 25న జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం కాగా, అదే నెల 19న గ్యాస్ సిలిండరు పేలడంతో 18 టెంట్లు కాలిపోయాయి. ఇదిలాఉండగా, మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో యూపీ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించడంతోపాటు కఠిన భద్రతా చర్యలను అమల్లోకి తెచ్చింది. రద్దీని నివారించడానికి 30పాంటూన్ బ్రిడ్జిలను వన్‌వేగా మార్చారు.
బుధవారం అర్ధరాత్రి అధికారులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. వసంత పంచమి (ఫిబ్రవరి 3) రోజున అమృత స్నానాలు ఉన్నందున ఏర్పాట్లను పరిశీలించాలని సీఎస్, డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్ పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు జిల్లా సరిహద్దుల్లోనే నిలిపివేయాలని, ఫిబ్రవరి 4వరకూ నగరంలోకి నాలుగు చక్రాల వాహనాల ప్రవేశంపై పూర్తిగా నిషేధం విధించారు.పాస్‌ల జారీ నిలిపివేయడంతోపాటు వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. కాగా, కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి హర్ష్‌కుమార్ నేతృత్వంలోని కమిషన్ నెలలోగా దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించనుంది. మాజీ డీజీపీ వీకే గుప్తా, విశ్రాంత ఐఏఎస్ డీకే సింగ్ సభ్యులుగా ఉంటారు.
కిక్కిరిసిన రైళ్లలో నరకం
కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివెళ్తున్న యాత్రికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన నగరాల నుంచి 13వేల రైళ్లతో పాటు మరో 3వేల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా.. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. నిలబడటానికీ స్థలం లేక ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. బోగీల తలుపులు మూసేస్తుండటంతో స్టేషన్లలో ఎక్కాల్సినవారు ఆగ్రహంతో రైళ్లపైకి రాళ్లు రువ్వుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News