FIITJEE: ‘ఫిట్జీ’ కోచింగ్ సెంటర్ల మూత
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:37 AM
ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లు, గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడమే ఇందుకు కారణం! సరిగ్గా కీలకమైన బోర్డు, ప్రవేశ పరీక్షల సమయంలో కోచింగ్ కేంద్రాలను మూసివేయడంపై వేలాది మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో..
కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో టీచర్ల మూకుమ్మడి రాజీనామాలు
బోర్డు, ప్రవేశ పరీక్షల ముందు మూతతో ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ
న్యూఢిల్లీ, జనవరి 24: ఇంజినీరింగ్, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, విద్యార్థుల ఫౌండేషన్ ప్రోగ్రామ్స్‌లలో పేరొందిన ఎఫ్‌ఐఐటీజేఈఈ(ఫోరం ఫర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- ఫిట్జీ) సెంటర్లు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూతపడ్డాయి. ఢిల్లీ, మేరట్, ఘజియాబాద్, లఖ్‌నవూ, వారాణసీ, ఇండోర్, భోపాల్, పాట్నా, పుణేతో పాటు తాజాగా నోయిడాలో ఆ సంస్థ కోచింగ్ సెంటర్లను మూసివేశారు. ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లు, గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడమే ఇందుకు కారణం! సరిగ్గా కీలకమైన బోర్డు, ప్రవేశ పరీక్షల సమయంలో కోచింగ్ కేంద్రాలను మూసివేయడంపై వేలాది మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఫిట్జీ సెంటర్ల ముందు ధర్నాలు చేశారు. నోయిడాలో పోలీసు ఫిర్యాదు చేశారు.
100 మందికి పైగా విద్యార్థుల ఫిర్యాదు మేరకు భోపాల్‌లో ఫిట్జీ సెంటర్‌పై కేసు నమోదైంది. దీంతో కోచింగ్ సెంటర్ లైసెన్స్‌ను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. గత ఏడాది జూన్‌లో తాను రెండేళ్లకు సంబంధించి రూ.4 లక్షల ఫీజును చెల్లించానని, ఇప్పుడు కోచింగ్ సెంటర్‌ను మూసివేయడంతో ఇంజినీర్ కావాలనే తన కుమార్తె కలపై ప్రభావం పడుందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించి కట్టిన ఫీజును తిరిగివ్వాలని లేదా మిగిలిన కోర్సును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల ప్రోగ్రామ్ ఫీజును ఒకేసారి చెల్లించామని, అందులో ఇంకా రెండేళ్లు ఉందని రాజీవ్ కుమార్ అనే మరో విద్యార్థి తండ్రి తెలిపారు.
నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు..
గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో చాలా మంది టీచర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని, దీని వలనే కోచింగ్ సెంటర్లు అకస్మాత్తుగా మూతపడ్డాయని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ‘నేను నాలుగేళ్లకు పైగా అక్కడ బోధన చేస్తున్నాను. గత ఏడాది జూలై నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో.. నేను నవంబర్‌లో పాట్నా కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేశాను’ అని ఒక టీచర్ పేర్కొన్నారు. అధ్యాపకులకు ఇతర కోచింగ్ సెంటర్ల నుంచి మంచి ఆఫర్లు రావడంతో వెళ్లిపోతున్నారని, దీంతో టీచర్ల లేకపోవడంతో మేరట్ సెంటర్‌ను మూసివేయాల్సి వచ్చిందని సిబ్బంది ఒకరు తెలిపారు.
నిధులు మళ్లింపు ఆరోపణలూ..
ఫిట్జీ సంస్థపై నిధులు మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయి. కోచింగ్ కార్యకలాపాల నిధులను ఇతర మార్గాలకు మళ్లించడంతో ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దీని వలన ఇన్వెస్టర్లు, టీచర్లు గుడ్‌బై చెబుతున్నారనే చర్చ నడుస్తోంది. లైసెన్స్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు చర్యలు కూడా తీసుకున్నారని ఎన్డీటీవీ పేర్కొంది. మరోవైపు ఫిజిక్స్ వాలా, అన్‌అకాడమీ వంటి కొత్త సంస్థల నుంచి కూడా ఫిట్జీ విపరీతమైన పోటీ ఎదుర్కొంటోంది. ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన డీకే గోయల్ అనే వ్యక్తి మూడు దశాబ్దాల క్రితం ఎఫ్‌ఐఐటీజేఈఈ సంస్థను స్థాపించారు. ఫిట్జీ సంస్థకు దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 300 మంది సిబ్బంది ఉన్నారు
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News