Karnataka Crime: పరువు హత్య.. గర్భవతి అని చూడకుండా కూతురిపై కన్నవారి దాష్టికం
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:00 PM
మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు. చంద్రమండలంలో అడుగుపెట్టాడు. అంతరిక్ష రహస్యాలు ఛేదిస్తున్నాడు. కానీ.. ఇప్పటికీ కులం, మతం, పరువు అనే మాయ నుంచి బయటపడలేకపోతున్నాడు.
కర్ణాటక: హుబ్బళ్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తమ పరువు తీసిందన్న కోపంతో కూతురు గర్భవతి అని చూడకుండా ఆమెపై దాడి చేయడంతో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. వీరాపుర గ్రామానికి చెందిన మాన్య పాటిల్ (19), వివేకానంద ఇద్దరూ డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. వివేకానంద అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు. దాంతో తండ్రి గౌడ పాటిల్ వారి పెళ్లికి నిరాకరించాడు. అంతేకాదు ఆ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమిస్తే మన పరువు పోతుందని.. అందరూ చావాల్సిందే అని బెదిరించాడు. కానీ, మాన్య మాత్రం తన ప్రియుడిని జూన్ 19న ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే మాన్య తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిచి రాజీ కుదిర్చారు పోలీసులు. కొత్త జంట హవేరీ జిల్లాలో కాపురం పెట్టారు. ఏడు నెలల నుంచి ఎలాంటి గొడవలు లేకపోవడంతో తన తల్లిదండ్రులు అంతా మర్చిపోయారని భావించింది మాన్య. ప్రస్తుతం మాన్య ఆరు నెలల గర్భవతి. హాస్పిటల్‌లో చూపించుకునేందుకు దంపతులు తిరిగి గ్రామానికి వచ్చారు. తన పరువు తీసి అత్తామామ వద్ద ఉన్న విషయం తెలుసుకున్న మాన్య తండ్రి కోపంతో రగిలిపోయాడు.
తన బంధువులు వీరన గౌడ మహదేవ గౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్‌తో వెళ్లి మాన్య అత్తమామ, భర్తపై పైపులు, రాడ్లతో దాడి చేశారు. వాళ్లను కొట్టవొద్దని అడ్డువచ్చిన మాన్యపై కూడా దారుణంగా దాడి చేయడంతో తీవ్ర గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ కన్నుమూసింది. భర్త, అత్తమామలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం నిందితులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!