Maharashtra: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:39 AM
మహారాష్ట్రలోని భండారా జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు వల్ల 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

8 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
మహారాష్ట్ర భండారా జిల్లాలో ఘటన
ముంబై, జనవరి 24 : మహారాష్ట్రలోని భండారా జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు వల్ల 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్ధారించారు. పేలుడు వల్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని ఒక యూనిట్ పైకప్పు కూలడంతో కార్మికులు దాని కింద చిక్కుకున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారని, మహారాష్ట్ర విపత్తుల స్పందన దళం సిబ్బంది కూడా వెళుతున్నారని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.