Election Commission: బిహార్ ఓటర్‌ల జాబితా సవరణలపై అభ్యంతరాలు.. ఈసీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:06 PM
ఓటర్ జాబితా సవరణకు సంబంధించి అన్ని దశల్లో రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పిస్తామని ఈసీ పేర్కొంది. ఈసారి కూడా ముసాయిదా జాబితాను పార్టీలతో పంచుకున్నామని తెలిపింది. ఆ సమయంలో పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ జాబితా తయారీకి సంబంధించి అన్ని దశల్లో రాజకీయ పక్షాలు భాగస్వాములయ్యాయని, కానీ అప్పుడు ఎవరూ సవరణలపై అభ్యంతరాలు చెప్పలేదని పేర్కొంది.
ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి పత్రాలతో పాటు డిజిటల్ కాపీలను కూడా అన్ని రాజకీయ పక్షాలతో పంచుకుంటామని ఈసీ వెల్లడించింది. జనాలందరికీ అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పెడతామని వెల్లడించింది. ఆ తరువాత అభ్యంతరాలను తెలియజేసేందుకు నెల రోజుల సమయం కూడా ఉంటుందని పేర్కొంది. ఆ తరువాత తుది ఓటర్ జాబితా కూడా రాజకీయ పక్షాలకు అందిస్తామని, అభ్యంతరాలు తెలిపేందుకు రెండు అంచెల అప్పీలు విధానం అందుబాటులో ఉందని పేర్కొంది.
ముసాయిదా ఓటర్ జాబితాలను రాజకీయ పక్షాలు వాటి బూత్ స్థాయి ఏజెంట్లు సరిగా పరిశీలించలేదేమోనని అనిపిస్తోందని ఈసీ శనివారం ఓ ప్రకటనలో వ్యాఖ్యానించింది. అప్పట్లో వారు సవరణల గురించి పేర్కొనలేదని వెల్లడించింది. సరైన సందర్భాల్లో సరైన మార్గాల్లో తమ అభ్యంతరాలను లేవనెత్త లేదని పేర్కొంది.
బిహార్‌లో ఓటర్ జాబితాలో మార్పులకు సంబంధించిన వివరాలను జులై 20 నుంచి అన్ని రాజకీయ పక్షాలకు ఇచ్చామని తెలిపింది. తొలగించిన పేర్లు, అందుకు కారణాలు, డూప్లికేట్ ఎంట్రీలు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు మార్గదర్శకాలు అన్నీ సవివరంగా తెలియజేసినట్టు పేర్కొంది.
ఇక ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై కూడా ఈసీ ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. తన ఆరోపణలను డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని లేదా క్షమాపణలు చెప్పాలని ఈసీ కోరింది. తప్పుగా తొలగించిన ఓటర్ల పేర్లు, ఇతర వివరాలు ఇవ్వాలని తెలిపింది. ఈ అంశంపై రాహుల్ గాంధీ ఆగస్టు 17న బీహార్‌లోని సాసారమ్ నగరం నుంచి ఓట్ అధికార యత్రాను ప్రారంభించనున్నారు. 20 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రలో రాహుల్ 1300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. సెప్టెంబర్ 1న పట్నాలోఈ యాత్ర ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి
భారత్ ఇలాంటి దాదాగిరి ఎన్నటికీ చేయదు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
పాక్ కోసం గూఢచర్యం.. జ్యోతి మల్హోత్రా కేసులో 2,500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు
For More National News and Telugu News