Share News

Rahul Gandhi: రాహుల్‌ ఆరోపణలు అర్థరహితం

ABN , Publish Date - Jun 09 , 2025 | 05:23 AM

త్వరలో బిహార్‌లోనూ అదే జరుగుతుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఓ వ్యాసంలో చేసిన ఆరోపణలకు బదులిచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిరాకరించింది. అవి అర్థంలేని ఆరోపణలుగా కొట్టివేసింది.

Rahul Gandhi: రాహుల్‌ ఆరోపణలు అర్థరహితం

మహారాష్ట్ర ఎన్నికలపై నేరుగా లేఖ రాస్తేనే

స్పందిస్తాం..వ్యాసాలకు జవాబివ్వం: ఈసీ

న్యూఢిల్లీ, జూన్‌ 8: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని.. బీజేపీ ఓటమి ఖాయమైన చోట్ల ఈసీ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడుతోందని.. త్వరలో బిహార్‌లోనూ అదే జరుగుతుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఓ వ్యాసంలో చేసిన ఆరోపణలకు బదులిచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిరాకరించింది. అవి అర్థంలేని ఆరోపణలుగా కొట్టివేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత నేరుగా తమకు లేఖ రాస్తేనే స్పందిస్తామని.. వ్యాసాలకు కాదని ఈసీ వర్గాలు ఆదివారం స్పష్టంచేశాయి. మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు గత ఏడాది డిసెంబరు 24నే కమిషన్‌ అన్ని వాస్తవాలతో జవాబులిచ్చామని.. అవి ఈసీ వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయని తెలిపాయి. తర్వాత అవే ఆరోపణలకు సంబంధించి చర్చించేందుకు గత నెల 15వ తేదీన ఆరు జాతీయ పార్టీలను ఆహ్వానించామని.. వాటిలో ఐదు పార్టీలు మాత్రమే వచ్చాయని.. కాంగ్రెస్‌ చివరి నిమిషంలో రద్దు చేసుకుందని వెల్లడించాయి. విధాన ప్రక్రియ ప్రకారం ఈసీ సహా ఏ రాజ్యాంగ సంస్థయినా తమకు లేఖ రాస్తేనే స్పందిస్తాయని తెలిపాయి. ‘తాను లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని రాహుల్‌ చెబుతుంటారు. కానీ లిఖితపూర్వకంగా మాకు పంపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని పేర్కొన్నాయి. మహారాష్ట్ర పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం జరిగిన ఓటింగ్‌పై సీసీటీవీ ఫుటేజీని ఈసీ బయటపెట్టాలని ఆయన తన వ్యాసంలో డిమాండ్‌ చేశారని.. ఈసీ మార్గదర్శకాల ప్రకారం.. ఎవరైనా ఎన్నికల పిటిషన్‌ దాఖలుచేస్తే సంబంధిత హైకోర్టు సదరు సీసీటీవీ ఫుటేజీని స్ర్కుటినీ చేయవచ్చని స్పష్టం చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 05:23 AM