EC : ఇవాళ ఢిల్లీలో ఈసీ ప్రెస్ మీట్.. బీహార్ ఓటరు జాబితా, రాహుల్ ఆరోపణలపై స్పందించే ఛాన్స్
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:23 AM
ఇవాళ మ.3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. బీహార్ ఓటరు జాబితా, రాహుల్ ఆరోపణలపై ఈసీ స్పందించే అవకాశం ఉంది.
న్యూ ఢిల్లీ, ఆగస్టు 17 : ఇవాళ మ.3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరుగబోయే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బీహార్ ఓటరు జాబితా, రాహుల్ ఆరోపణలపై ఈసీ స్పందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తినెలకొంది. ముఖ్యంగా రాజకీయవర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది.
ఇలా ఉండగా, ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, దీనిని 'ఓట్‌బందీ'గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం (EC) తీరుకు నిరసనగా ఆయన నిన్న (శనివారం) బీహార్ లో 'ఓట్ అధికార్ యాత్ర'ను ససారామ్ నుంచి ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ యాత్ర బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 16 రోజుల పాటు.. 23 జిల్లాల మీదుగా కొనసాగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి మహాగఠ్‌బంధన్ మిత్రపక్షాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌తో కలిసి తాము కూడా ప్రజలను సమీకరిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా చెప్పారు.
మరోపక్క, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓట్లను తొలగిస్తోందని ఆగస్టు 7న రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ఆధారంగా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ డేటాను ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని కోరగా, తాను రాజ్యాంగంపై ప్రమాణం చేసినందున ఆ అవసరం లేదని రాహుల్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ప్రెస్ మీట్ లో ఈసీ ఎలాంటి వివరణలు ఇస్తుందో అన్నది అందర్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి