Share News

ED Raids: దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 09:19 AM

ప్రముఖ నటులు దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి ED అధికారులు

ED Raids: దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు
Dulquer Salmaan ED raids

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటులు దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి ED అధికారులు ఈ దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని దుల్కర్ నివాసానికి ఈ ఉదయం చేరుకున్న ఈడీ అధికారులు క్షుణ్ణంగా సోదాలు జరుపుతున్నారు.


ఇక, ఈ కేసు మూలాల్లోకి వెళ్తే, భూటాన్‌ ఆర్మీ ఇటీవల తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను తీసివేసింది. ఆ ఖరీదైన కార్లను కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటిని ఎలాంటి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా భారత్‌‌కు స్మగ్లింగ్‌ చేశారన్న సమాచారం ఈడీకి చేరింది. సినీ, వ్యాపార వర్గాల్లోని కొందరిని గుర్తించి వారికి మాత్రమే ఈ కార్లను విక్రయిస్తున్నారని తెలుస్తోంది.


ఇలా ఉండగా, కార్ల స్మగ్లింగ్ వ్యవహారం తెలంగాణాను తాకింది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కార్ల స్మగ్లింగ్ గురించి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కార్‌ పార్టీ (బీఆర్‌ఎస్‌) అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆ సమయంలో ప్రశ్నించారు. ‘లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బసరత్‌ ఖాన్‌ అక్రమంగా దిగుమతి చేసుకున్న ల్యాండ్‌ క్రూజర్లలో ఒకదాంట్లో కేటీఆర్‌ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కారు కేసీఆర్‌ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేరుతో ఎందుకు రిజిస్టర్‌ అయింది? మార్కెట్‌ ధర చెల్లించారా? లేదంటే ధర తక్కువగా చూపించి కొనుగోలు చేశారా? చెల్లింపులు బినామీ పేర్లతో జరిగాయా? మనీలాండరింగ్‌ జరిగిందా? అని నిలదీశారు. ఈ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా?’ అని సంజయ్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా.. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎనిమిది కార్లను స్మగ్లింగ్‌ చేసినట్లు డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారుల విచారణలో ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాల స్మగ్లర్‌ బసరత్‌ ఖాన్‌ అంగీకరించారు. ఆ వాహనాల నంబర్లనూ అధికారులకు బసరత్‌ ఖాన్‌ అందజేశారు. ఆ నంబర్లలో టీజీ00డి 6666 నంబరు గల ల్యాండ్‌ క్రూజర్‌ వాహనాన్ని తన కాన్వాయిలో కేటీఆర్‌ ఉపయోగిస్తున్నట్లుగా అధికారుల ఎదుట బసరత్‌ఖాన్‌ చెప్పారు.

మొత్తం కార్ల స్మగ్లింగ్ వ్యవహారంలో వాస్తవాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని బండి సంజయ్ సెప్టెంబర్ 22న డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం విశేషం.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 11:02 AM