Share News

Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:42 AM

ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.

Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం

  • దీనిపై త్వరలో సమావేశం అవుదాం

  • రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ

న్యూఢిల్లీ, మార్చి 11: ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ల స్థాయిల్లో ఏవైనా పరిష్కారం కాని సమస్యలపై ఏప్రిల్‌ 30 నాటికి అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. చట్టానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడంపై రాజకీయ పార్టీల అధ్యక్షులు, సీనియర్‌ నేతలతో సమావేశానికి కూడా ఈసీ ప్రతిపాదించింది. ఈ మేరకు పరస్పర అనుకూల సమయంలో భేటీ అవుదామని పేర్కొంటూ అన్ని పార్టీలకు మంగళవారం వేర్వేరుగా లేఖలు పంపింది.


ఓటర్ల జాబితాల అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో.. నకిలీ గుర్తింపు కార్డు (ఈపీఐసీ) నంబర్ల అంశం పార్లమెంట్‌లో దూమారం రేపింది. దీనిపై పలు రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. గత కొన్నేళ్లుగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమౌతోందని, ఈసీపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ డిమాండ్‌ చేశారు. కాగా, బీజేపీ, టీఎంసీ, బీజేడీ పార్టీల ప్రతినిధి బృందాలు మంగళవారం విడివిడిగా ఈసీని కలిసి, ఓటర్ల జాబితాలో అవకతవకలపై తమ వాదన వినిపించాయి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరాయి.

Updated Date - Mar 12 , 2025 | 05:42 AM