Share News

Army Officer: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. కారుతో 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:21 AM

సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Army Officer: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. కారుతో 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి

నాగ్‌పూర్‌, 4: సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. అస్సాంలో సైనికుడిగా పనిచేస్తున్న హర్షపాల్‌ మహాదేవ్‌ వాఘ్‌మారే (40) నాలుగు రోజుల సెలవుపై మహారాష్ట్రలోని తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పక్క గ్రామానికి కారులో బయల్దేరాడు. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి రోడ్డుపై వెళ్తున్న దాదాపు 30 మందిని ఢీకొట్టాడు.


ఈ ప్రమాదంలో కారు బోల్తాకొట్టి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ మురుగు కాలువ నుంచి హర్షపాల్‌ను బయటకు లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఆర్మీ అధికారిని స్థానిక ఆస్సత్రికి తరలించారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 05 , 2025 | 05:21 AM