Share News

Dr. Nageshwar Reddy : కోట్ల రూపాయలు ఇస్తామన్నా విదేశాలకు వెళ్లని దేశ భక్తుడు

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:27 AM

గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులలో ఆయన ఒకరు. ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు. ఏకంగా 1050కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయన

Dr. Nageshwar Reddy  : కోట్ల రూపాయలు ఇస్తామన్నా విదేశాలకు వెళ్లని దేశ భక్తుడు

పద్మవిభూషణుడు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

వైద్యరంగంలో చేసిన విశిష్ట సేవలకు ప్రభుత్వం గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులలో ఆయన ఒకరు. ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు. ఏకంగా 1050కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయన స్పృశించని అంశమంటూ లేదనే ఖ్యాతిని గడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్‌, ఇప్పటికే భారతదేశంలో రెండు పౌర పురస్కారాలను అందుకున్న డాక్టర్‌ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ వరించింది. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్న డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి.. విజయవాడలో ఇంటర్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య ను అభ్యసించారు. అనంతరం చెన్నైలో ఇంటర్నల్‌ మెడిసిన్‌, చండీగఢ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. తొలుత నిమ్స్‌, గాంధీ ఆస్పత్రుల్లో సేవలందించారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు ఐఐఎ్‌స సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌ వంటి సంస్థలతో కలిసి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించిన డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి.. చికిత్సల్లో అత్యాధునిక సాంకేతిక వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చారు. భారత్‌, జపాన్‌ సం యుక్త ఆధ్వర్యంలో ఏఐ బేస్డ్‌ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు.


ఎన్నెన్నో అవార్డులు..

డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డిని ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఎండోస్కోపీ రంగంలో ప్రపంచ అత్యధిక పురస్కారంగా, వైద్య పరిభాషలో ఎండోస్కోపీకి సంబంఽధించి నోబెల్‌ బహుమతిగా అభివర్ణించే ‘మాస్టర్‌ ఆఫ్‌ ఎండోస్కోపిస్ట్‌’ అవార్డును 2009లో అందుకున్నారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ (ఏఎ్‌సజీఈ) ఈ అవార్డును అందజేసింది. 2013లో ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడిగా నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇక 2022లో ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ (ఏజీఏ) అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. వరల్డ్‌ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు ప్రెసిడెంట్‌గా బాద్యతలు చేపట్టిన మొదటి భారతీయుడిగానూ రికార్డు సాధించారు. నగరంలో నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి, ఇప్పుడు గ్యాస్ట్రో ఎంటరాలజీ పరంగా హార్వర్డ్‌, హాంకాంగ్‌లోని ఆస్పత్రుల తర్వాత మూడో స్థానంలో ఉంది.


దేశసేవను మించిన భాగ్యం లేదు..

హార్వర్డ్‌ యూనివర్సిటీ లాంటివి కోట్ల రూపాయల జీతం ఇచ్చేందుకు ముందుకొచ్చినా దేశ సేవను మించిన భాగ్యం లేదంటూ నిర్ద్వంద్వం గా తిరస్కరించిన విశిష్ట వ్యక్తి డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి. గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్స అంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే అనేంతగా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది డాక్టర్లు నగరానికి వచ్చి మరీ ఆయన వద్ద శిష్యరికం చేస్తున్నారు.

భారతీయ వైద్య స్ఫూర్తిని చాటే సందర్భం

పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసినట్టుగా కేంద్రం ప్రకటించిన వెంటనే డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత మైలురాయి మాత్రమేకాదని, భారతీయ వైద్య స్ఫూర్తిని, ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో మన దేశ గొప్పదనాన్ని చాటే సందర్భమన్నారు. రోగి సంరక్షణ కోసం కరుణతో కూడిన సేవలందించడమే తన ప్రథమ కర్తవ్యమని, తమపై నమ్మకం ఉంచే ప్రతి వ్యక్తికీ తాను ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అంటే కేవలం రోగాన్ని నయం చేయడమేకాదని, మానవాళిపై గౌరవం, సానుభూతితో సేవ చే యడమని తాను గట్టిగా నమ్ముతానన్నారు.


ఇవి కూడా చదవండి

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 04:27 AM