Share News

Vijay Rupani: విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:16 AM

ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. ఆయన కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించామని తెలిపారు.

Vijay Rupani: విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

ఇప్పటివరకు 47 దేహాల డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తి.. 24 దేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత

  • విమాన ప్రమాద స్థలంలో ముక్కలుగా లభ్యమైన మృతదేహాలు

  • అన్ని భాగాలకు డీఎన్‌ఏ విశ్లేషణతో ఆలస్యం జరుగుతోందంటున్న ఆస్పత్రి వర్గాలు

  • ముక్కలుగా ఉన్న శరీరభాగాలను అప్పగిస్తుండటంతో బంధువుల ఆవేదన

అహ్మదాబాద్‌, జూన్‌ 15: ఎయిరిండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని వైద్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. ఆయన కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించామని తెలిపారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ స్వయంగా రూపాణీ కుటుంబసభ్యులను కలిసి ఈ విషయం చెప్పారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్‌ పటేల్‌ వెల్లడించారు. రూపాణీ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో రాజ్‌కోట్‌కు తరలించి సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితోపాటు వైద్య విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబసభ్యులు, హాస్టల్‌ మెస్‌లోని పనివారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు కలిపి మరో 33 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంలో భారీ పేలుడుతోపాటు మంటలు వ్యాపించడంతో.. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. చాలా మృతదేహాలు ఛిద్రమై భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి.


వాటన్నిటినీ అహ్మదాబాద్‌ నగర సివిల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాలు, భాగాల నుంచి శాంపిళ్లు సేకరించి.. ఆ డీఎన్‌ఏతో కుటుంబసభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చే ప్రక్రియ చేపట్టారు. అన్ని భాగాలకు డీఎన్‌ఏ విశ్లేషణ చేయాల్సి వస్తుండటంతో ఆలస్యం జరుగుతోందని వైద్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు 47 మృతదేహాలకు డీఎన్‌ఏ విశ్లేషణ పూర్తయిందని, అందులో 24 దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని చెప్పారు. అయితే ముక్కలు ముక్కలుగా ఉన్న కొన్ని శరీర భాగాలను అప్పగిస్తుండటంతో.. కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదనకు లోనవుతున్నారు. పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని వైద్యులను వేడుకుంటున్నారు. ఇక తమ వారి మృతదేహాల గుర్తింపు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ కార్యాలయ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా ఆదివారం విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం మధ్యాహ్నం తొలి భేటీ నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 16 , 2025 | 05:16 AM