Share News

మురికి కాల్వలో మహిళ శవం.. ముక్కుపుడకతో నేరస్థుడి పని ఔట్

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:43 PM

ఎంత పెద్ద నేరస్థులైన, ఎంతో తెలివిగా నేరం చేశామని భావించేవారైనా సరే.. ఎక్కడో చోట తప్పు చేస్తారు. ఆ చిన్న మిస్టేక్ వారిని పట్టిస్తుంది. తాజాగా ఓ కేసులో చిన్న ముక్కు పుడక సాయంతో హంతకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు..

మురికి కాల్వలో మహిళ శవం.. ముక్కుపుడకతో నేరస్థుడి పని ఔట్
Delhi

ఢిల్లీ: ఎంతో తెలివిగా నేరం చేశాం.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు వదలలేదు.. ఇక మమ్మల్ని పోలీసులు కూడా పట్టుకోలేరని దర్జాగా తిరుగుతుంటారు కొందరు నేరగాళ్లు. కానీ ఎంత తెలివిగా నేరం చేసినా సరే.. ఎక్కడో చోట చిన్న క్లూ వదులుతారు. దాని సాయంతో కేసు చేధించి నేరస్తుల ఆట కట్టిస్తారు పోలీసులు. తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఇదే నిజమయ్యింది. ఎంతో తెలివిగా భార్యను హత్య చేశాడు. చిన్న క్లూ కూడా వదల్లేదు.. ఇక పోలీసులు తనను గుర్తించలేరని భావించాడు. కానీ భార్య పెట్టుకున్న ముక్కుపుడక అతడి పాలిటి యమపాశం అయ్యింది. ముక్కుపుడక సాయంతో పోలీసులు అసలు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం మురికికాల్వలో లభ్యమైన మహిళ మృతదేహం కేసులో.. ముక్కుపుడక కీలక పాత్ర పోషించి.. అసలు నిందితుడిని పట్టించింది. ముక్కుపుడక ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే.. అతడు మృతురాలి భర్త. నిందితుడు తన భార్యను హత్య చేసి.. బెడ్‌షీట్‌లో చుట్టి.. దానికి రాయి కట్టి.. మురికి కాల్వలో పడేశాడు.


ముక్కు పుడక సాయంతో..

సుమారు నెల క్రితం అనగా మార్చి 15న మురికి కాల్వలో మహిళ మృతదేహం వెలుగు చూడటం సంచలనంగా మారింది. డెడ్ బాడీని బయటకు తీసిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతురాలు పెట్టుకున్న ముక్కు పుడక.. కీలకంగా మారింది. ముక్కు పుడక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దక్షిణ ఢిల్లీలోని ఓ ఆభరణాల దుకాణానికి వెళ్లి.. ముక్కు పుడక గురించి విచారించారు. ఈ క్రమంలో ప్రాపర్టీ డీలర్ అనిల్ కుమార్ అనే వ్యక్తి.. ఆ ముక్కు పుడకను కొన్నట్లుగా గుర్తించారు. అతడి గురించి ఆరా తీయగా.. గురుగ్రామ్ ఫామ్‌హౌస్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఇక మృతదేహాన్ని 47 సంవత్సరాల సీమా సింగ్‌గా గుర్తించారు పోలీసులు.


ఆమాటతో భర్తపై అనుమానం..

విచారణలో భాగంగా పోలీసులు అనిల్ కుమార్ ఇంటికి చేరుకోగా.. సీమా సింగ్ అతడి భార్య అని తెలిసింది. పోలీసులు ఆమెతో మాట్లాడతాము.. పిలిపించమని కోరారు. అప్పుడు అనిల్ ఆమె ఇంట్లో లేదని బృందావన్ వెళ్లిందని.. ఫోన్ కూడా తీసుకెళ్లదని పోలీసులకు తెలిపాడు. అతడు ఇచ్చిన సమాధానం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తించింది. ఆ తర్వాత పోలీసులు ద్వారకలోని కుమార్ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ అతడి డైరీలో కుమార్ అత్తగారి నంబర్‌ను కనుగొన్నారు. వారికి కాల్ చేయగా.. సీమా సోదరి బబిత పోలీసులతో మాట్లాడింది. తాము మార్చి 11 నుంచి సీమాతో మాట్లాడలేదని.. ఆమె గురించే ఆందోళన చెందుతున్నామని తెలిపారు. బబిత చెప్పిన విషయం గురించి కుమార్‌ను ప్రశ్నించగా.. ఆమె జైపూర్‌లో ఉందని.. ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేదని చెప్పుకొచ్చాడు. సీమా మూడ్ సెట్ అయ్యాక ఆమెతో మాట్లాడిస్తానని తెలిపాడు.


అయితే ఎన్ని రోజులైనా సరే.. సీమ నుంచి ఆమె కుటుంబ సభ్యులకు కాల్ రాలేదు. దాంతో సీమ భద్రతపై వారికి అనుమానాలు మొదలయ్యాయి. ఆమె మిస్ అయి ఉంటుందని భావించి పోలీసులను సంప్రదించాలని అనుకున్నారు. కానీ కుమార్ వారిని ఎప్పటికప్పుడు ఆపుతుండేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. పది రోజుల క్రితం అనగా ఏప్రిల్ 1న పోలీసులు మృతదేహాన్ని గుర్తించడం కోసం సీమ కుటుంబ సభ్యులను పిలిపించారు. వారు ఆ డెడ్ బాడీ సీమాదే అని తెలిపారు. మరుసటి రోజు సీమా కుమారుడిని పిలిపించి అడగ్గా ఆ డెడ్ బాడీ తన తల్లిదేనని చెప్పుకొచ్చాడు.


సీమ కుటుంబ సభ్యులు.. ఆమె పోస్ట్‌మార్టం నివేదికను ఉటంకిస్తూ కుమార్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కుమార్, అతడి గార్డ్ శివ్ శంకర్‌ని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్

Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..

Updated Date - Apr 11 , 2025 | 02:02 PM