Delhi: కాలం చెల్లిన వాహనాలు బంకుల్లోనే సీజ్
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:38 AM
ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలను పెట్రోల్ బంకుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసినట్టు గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఢిల్లీ రవాణా కమిషనర్ నిహారికా రాయ్ తెలిపారు.
ఆ వాహనాలకు ఇంధనం బంద్..జూలై 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ/నోయిడా, జూన్ 27: ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలను పెట్రోల్ బంకుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసినట్టు గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు ఢిల్లీ రవాణా కమిషనర్ నిహారికా రాయ్ తెలిపారు. ఇలాంటి వాహనాలను వినియోగించకుండా ఉండేందుకుగాను స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులకు జరిమానాలను విధించనున్నట్టు చెప్పారు. ఫోర్ వీలర్ వాహనాలైతే యజమానులకు రూ.10వేలు, ద్విచక్ర వాహనదారులకు అయితే రూ.5వేల జరిమానా విధిస్తామన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(సీఏక్యూఎం) జారీచేసిన ఇంతకు ముందటి ఆదేశాల ప్రకారం.. జూలై ఒకటో తేదీ నుంచి కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో ఇంధనాన్ని విక్రయించరు. ఆ వాహనాలు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయినా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కాగా కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి గాను ఢిల్లీలోని దాదాపు 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు