Share News

PM Modi Education: ప్రధాని మోదీ డిగ్రీ వెల్లడిలో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు!

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:15 AM

సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రధాని మోదీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీల విద్యాభ్యాసం వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాంట్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని పేర్కొంది.

PM Modi Education: ప్రధాని మోదీ డిగ్రీ వెల్లడిలో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు!

  • దాన్ని వెల్లడించాల్సిన అవసరం లేదు

  • స్మృతి ఇరానీ విషయంలో కూడా అంతే

  • మోదీ డిగ్రీపై మాడభూషి ఆదేశాల్ని కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రధాని మోదీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీల విద్యాభ్యాసం వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాంట్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని పేర్కొంది. ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను కోరుతూ నీరజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ).. 2016లో ఢిల్లీ వర్సిటీకి ఆదేశాలు జారీ చేస్తూ సదరు వివరాలు వెల్లడించాలని పేర్కొంది. 1978 బ్యాచ్‌లో వర్సిటీలో బీఏ పాసైన (అదే ఏడాది మోదీ బీఏ పూర్తి చేశారని సమాచారం) వారి వివరాలను దరఖాస్తుదారు పరిశీలించే అవకాశం కల్పించాలని తెలిపింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ వర్సిటీ పిటిషన్‌ వేయగా.. కోర్టు 2017లో స్టే విధించింది. తర్వాతకాలంలో ఈ అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన తీర్పును రిజర్వు చేసిన జస్టిస్‌ సచిన్‌దత్తా సోమవారం వెలువరించారు. పాలనలో పారదర్శకత కోసం ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చారుగానీ సంచలనాలకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వటం కోసం కాదన్నారు.


పదవులకు కనీస విద్యార్హతలు ఏమీ లేవు

ప్రధాని, మంత్రి వంటి ప్రభుత్వ పదవులు నిర్వహించేవారికి ఎటువంటి విద్యార్హతలను రాజ్యాంగం నిర్దేశించలేదని, కాబట్టి, వారి విద్యార్హతల సమాచారం వెల్లడించాల్సిన అవసరం లేదని జస్టిస్‌ సచిన్‌దత్తా తెలిపారు. ఒక వ్యక్తికి సంబంధించిన మార్కుల మెమో, ఫలితాలు, డిగ్రీ, సర్టిఫికేట్‌ వంటివి వ్యక్తిగత సమాచారమని, అది ఆర్టీఐ పరిధిలోకి రాదని.. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికైనా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర మాజీమంత్రి స్మృతీ ఇరానీ చదివిన 10, 12వ తరగతుల ఫలితాలను వెల్లడించాలన్న సీఐసీ ఆదేశాల్ని కూడా జస్టిస్‌ సచిన్‌దత్తా కొట్టివేశారు. సంచలనం కోసమే ముందుకొచ్చే ఇటువంటి డిమాండ్లను ఆమోదిస్తే.. అవి తామరతంపరగా పెరిగిపోతాయని న్యాయమూర్తి తన 175 పేజీల తీర్పులో పేర్కొన్నారు. కాగా, విచారణ సందర్భంగా ఢిల్లీ వర్సిటీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. 1978 బ్యాచ్‌ బీఏ ఫలితాల్ని బహిరంగపర్చలేంగానీ కోర్టుకు చూపించటానికి వర్సిటీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కాగా, ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు వెల్లడించాల్సిందేనని, అలా వెల్లడించేందుకు నిరాకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రజాసంబంధాల అధికారి జీతం నుంచి రూ.25 వేలు కోత విధించాలని అప్పటి కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు 2016 డిసెంబర్‌లో జారీ చేసిన తుది ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది.

Updated Date - Aug 26 , 2025 | 01:15 AM