రక్షణ శాఖకు అంతంతే!
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:52 AM
నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లను కేటాయించగా వాటిల్లో మిలటరీ మోడ్రనైజేషన్, కొత్త ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ తుపాకులు, డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల కొనుగోలుకు వెచ్చించనున్నది కేవలం రూ.1.8 లక్షల కోట్లు మాత్రమే..!

రూ.6.81 లక్షల కోట్ల కేటాయింపులు
గత ఏడాదితో పోలిస్తే 9% అధికం
మన జీడీపీలో 1.9% మాత్రమే
చైనాలో మనకంటే 3 రెట్లు అధికం!
రక్షణ శాఖ ఆధునికీకరణకు రూ.1.8 లక్షల కోట్లు మాత్రమే..!
ఓ వైపు చైనా.. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ముప్పు పొంచి ఉన్నా.. కేంద్ర బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నట్లు నిపుణులు పెదవి విరుస్తున్నారు. నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లను కేటాయించగా వాటిల్లో మిలటరీ మోడ్రనైజేషన్, కొత్త ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ తుపాకులు, డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల కొనుగోలుకు వెచ్చించనున్నది కేవలం రూ.1.8 లక్షల కోట్లు మాత్రమే..! గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది బడ్జెట్‌లో పెరుగుదల 9ు, సవరించిన అంచనాల(రూ.6.41 లక్షల కోట్లు)తో పోలిస్తే 6శాతంగా ఉంది. మొత్తానికి భారత జీడీపీ(రూ.324.11 లక్షల కోట్లు)లో రక్షణ శాఖకు జరిగిన కేటాయింపులు 1.9 శాతంగా ఉన్నాయి. మొత్తం రక్షణ బడ్జెట్‌లో రూ.3.11 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కాగా.. పింఛన్లకు రూ.1.6 లక్షల కోట్లను కేటాయించారు.
వెనుకబాటే..!
చైనాతో పోలిస్తే రక్షణ రంగంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. ‘‘యుద్ధ విమానాల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. దశాబ్దన్నర క్రితం ఆర్డర్ చేసిన ఫైటర్ జెట్లు ఇంకా రానేలేదు’’ అంటూ వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆందోళనకు బలాన్ని చేకూరుస్తూ చైనా ఇటీవల ఆరవ తరానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను పరీక్షించింది. మన దగ్గర పరిస్థితిని చూస్తే ఏఎంసీఐ ఐదో తరం యుద్ధ విమానాలు 2035 కల్లా వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అటు రాఫెల్ విమానాల కొనుగోలు విషయంలో 126 నుంచి 36కు తగ్గించిన ప్రభుత్వం 114 తేజ్‌సలపై దృష్టి సారించినా.. అమెరికా నుంచి ఇంజన్ల దిగుమతిలో ఆలస్యంతో ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. నౌకాదళం విషయానికి వస్తే భారత్ వద్ద యుద్ధ విమానాలను తరలించే నౌక ఒక్కటే ఉండగా రష్యా నుంచి తీసుకున్న మరో యుద్ధ నౌక సమస్యలకు నిలయంగా మారింది. అదే సమయంలో చైనా రెండు క్యారియర్ యుద్ధ నౌకలను వినియోగిస్తుండగా.. మూడోది ఇటీవలే ప్రారంభమైంది. ఆరు క్యారియర్ నౌకలపై చైనా దృష్టి సారించింది. నౌకాదళం విషయంలో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇక పదాతిబలగాలకు సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులపరమైన సంపత్తిని పెంచుకునేందుకు రక్షణ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిరా అసెట్స్ షేర్‌ఖాన్ ఉపాధ్యక్షుడు గౌరవ్ దువా ఈ అంశంపై రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. మోడ్రనైజేషన్‌కు చాలా తక్కువగా రూ.1.8 లక్షల కోట్లను కేటాయించారని పేర్కొన్నారు.
రక్షణకు ఇంతే..!
2024-25, 6,41,000
2025-26, 6,81,210
రూ. కోట్లలో
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి