Bihar Elections: ఎన్నికల్లో పోటీచేయకుండానే.. మంత్రిగా ప్రమాణం..
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:25 PM
బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 10వ సారి సీఎంగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడో వ్యక్తి. క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్‌తోనే మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన వివరాలిలా...
ఇంటర్నెట్ డెస్క్: ఆయనో టెకీ.. పేరు దీపక్ ప్రకాశ్. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచాక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెగ వైరల్ అవుతున్న పేరిది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఏకంగా మంత్రిగా ప్రమాణం చేశారు(Bihar Minister Deepak Prakash). ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులంతా కుర్తా, పైజామా, ధోవతీలతో విచ్చేశారు. కానీ ఈ సన్నని, బక్కపలుచటి వ్యక్తి మాత్రం డిఫెరెంట్‌గా హాజరై అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. క్యాజువల్ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి.. అదే వేదికపై ప్రధాని మోదీని కలిశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎన్నికల బరిలో నిలవకుండా మంత్రి పదవి ఎలా దక్కిందంటే.?
ఇదీ కుటుంబ నేపథ్యం..
రాష్ట్రీయ లోక్ మోర్చా(RLM) చీఫ్ ఉపేంద్ర కుష్వా(Upendra Kushwaha), స్నేహలత కుష్వా(Snehlata Kushwaha)ల కుమారుడే దీపక్ ప్రకాశ్(Deepak Prakash). ఉపేంద్ర కుష్వా రాజ్యసభ ఎంపీ కాగా, స్నేహలత సాసారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించినప్పటికీ.. తనయుడు 36 ఏళ్ల దీపక్ మాత్రం ఎలాంటి రాజకీయ పోటీ ఎదుర్కోకుండానే మంత్రి అయ్యారు. వృత్తి పరంగా టెక్నీషియన్ అయిన దీపక్.. మణిపాల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్చిచేసి, ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రిగా రాజకీయ ప్రవేశం చేశారు.
అవకాశం దక్కిందిలా..
ఆర్ఎల్ఎమ్(Rashtriya Lok Morcha) పార్టీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో పోటీ చేసి, 4 చోట్ల విజయం సాధించింది. దీంతో నితీశ్ హయాంలో ఏకైక మంత్రి పదవి అవకాశాన్ని దక్కించుకుంది. తొలుత తల్లికి ఆ రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తారని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్ఎల్ఎమ్ చీఫ్ ఉపేంద్ర చివరి నిమిషంలో తనయుడి పేరును ప్రకటించారు. ఇలా ఊహించని రీతిలో అవకాశం దక్కించుకున్న దీపక్.. ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
తనకు మంత్రి పదవి వరించిన విషయమై దీపక్ స్పందించారు. 'అవును, నాకు మంత్రి పదవి వచ్చింది. రాజకీయాలేం నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచీ నాన్నను చూస్తూ రాజకీయాలను గమనిస్తూనే పెరిగాను. నాలుగైదుగేళ్లుగా పార్టీలో చురుగ్గా ఉంటున్నాను.' అని అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన సాధారణ దుస్తుల గురించి ప్రశ్నించగా.. 'రాజకీయాలు సాధ్యమైనంత వరకూ సామాన్యులకు దగ్గరగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇక నా దుస్తుల విషయానికొస్తే.. నాకు సౌకర్యవంతమైనవే ధరించాను. మరో ఐదేళ్లూ ఇలాగే ఉంటాను. తర్వాతి కాలంలో కుర్తా-పైజామాకు మారతానో లేదో, కాలమే చెబుతుంది.' అని సమాధానమిచ్చారు మంత్రి దీపక్.
ఇది సాధ్యమేనా.?
ఇక.. దీపక్ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎలా మంత్రి అయ్యాడనే విషయమై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా క్యాబినెట్‌లో కొనసాగవచ్చు. కానీ, రాబోయే 6 నెలల్లోగా ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికవ్వాలి లేదా శాసనమండలికి నామినేట్ అవ్వాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: