Pilot dies at Tejas crashes: కూలిన తేజస్ ఫైటర్ జెట్.. పైలట్ మృతి
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:51 PM
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలి పైలట్ మృతిచెందారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ధృవీకరిస్తూ.. మృతిడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో ప్రమాదం సంభవించింది. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలి పైలట్ మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తున్న సమయంలో తేజస్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయం అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు భారత వాయుసేన ధృవీకరించింది. ఈ ఘటనలో పైలట్ మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సదరు పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నట్టు పేర్కొంది వాయుసేన. ఘటనపై విచారణ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.
ఎలా జరిగిందంటే.?
అల్ మక్తూమ్ విమానాశ్రయంలో.. మధ్యాహ్నం సమయంలో తేజస్ విమానం టేకాఫ్ అయిన కాసేపు గింగిరాలు తిరుగుతూ అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించింది. కొంత దూరం వెళ్లాక ఫ్లైట్ నుంచి ఎజెక్షన్(పొగలు రావడం) ఆగిపోవడంతో వేగం తగ్గిపోయి అమాంతం నేలకొరిగింది. ఫ్లైట్‌ను అదుపు చేసేందుకు పైలట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
గతంలోనూ..
ప్రమాదానికి గురైన తేజస్ ఫ్లైట్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించగా.. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేసింది. ఇది ఇండియాకు చెందిన 4.5వ తరం తొలి ఫైటర్ జెట్. ఇలాంటి ఎంకే-1 తేజస్ జెట్‌లు భారత వాయుసేనలో మరికొన్ని ఉండగా.. ఇలా ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. గతంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోనూ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ఘటనలో నాడు పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇవీ చదవండి: