రాష్ట్రంలోని సాంస్కృతిక సంస్థలకు మరింత ఊతం
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:16 AM
సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్)తో రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఐసీసీఆర్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం
న్యూఢిల్లీ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్)తో రాష్ట్రప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం, ఐసీసీఆర్ కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పందంపై విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి, ఐసీసీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మనీషా స్వామి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు సంతకాలు చేశారు. కార్యక్రమానికి ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ నందిని సింగ్లా, ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ ఒప్పందంతో ఏపీలోని సాంస్కృతిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచ సాంస్కృతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం ఈ ఒప్పందంతో మరింత ఇనుమడించనుంది.