Social Media Fake Account: కర్ణాటక సుప్రీంకోర్టు పేరుతో సొలిసిటర్ జనరల్ ఎక్స్ ఖాతా తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరూపించేందుకే
ABN , Publish Date - Jul 20 , 2025 | 06:01 AM
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్ణాటక’ పేరిట నకిలీ ‘ఎక్స్’ ఖాతాను తెరిచారు. ఒక కోర్టు ఫొటోను కూడా దీనికి జతచేసి, అధికారిక ఖాతాలా కనిపించేలా చేశారు...
న్యూఢిల్లీ/బెంగళూరు, జూలై 19: సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘సుప్రీంకోర్ట్ ఆఫ్ కర్ణాటక’ పేరిట నకిలీ ‘ఎక్స్’ ఖాతాను తెరిచారు. ఒక కోర్టు ఫొటోను కూడా దీనికి జతచేసి, అధికారిక ఖాతాలా కనిపించేలా చేశారు. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ముప్పు ఎంత తీవ్రంగా ఉందో నిరూపించేందుకు ఈ ఖాతాను శుక్రవారం ఆయన కర్ణాటక హైకోర్టులో ప్రదర్శించారు. ఆయన ఫోన్‌ను జస్టిస్ నాగ ప్రసన్నకు అందజేసి, ఈ నకిలీ ‘ఎక్స్’ ఖాతాను చూపించారు. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని ఇంత సులువుగా వ్యాప్తి చేయొచ్చంటూ వాదించారు. ‘ఇది ట్విటర్ వెరిఫై చేసిన ఖాతా. ఇప్పుడు నేను ఇందులో ఏమైనా పోస్టు చేయొచ్చు. వీటిని చూసిన లక్షలాదిమంది ఆ వివరాలన్నీ కర్ణాటక సుప్రీంకోర్టే చెప్పిందనుకుంటారు’ అన్నారు. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఖాతాలను తెరిచిన అజ్ఞాత వ్యక్తులు వాటిలో చట్టవిరుద్ధమైన అంశాలను పోస్టు చేస్తే.. బాధిత పక్షం ఎవరిపై దావా వేస్తుందని తుషార్ మెహతా ప్రశ్నించారు. ‘ఎక్స్’ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్ వాదిస్తూ.. అధికారికంగా నమోదు చేయకుండా నకిలీ ఖాతాలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అది ‘ఎక్స్’ వెరిఫై చేసిన ఖాతా కాదన్నారు. సోషల్ మీడియా వేదికలన్నీ సహయోగ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు కావాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ‘ఎక్స్’ సంస్థ సవాలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వాదనలు కొనసాగాయి. తదుపరి విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఆ కల్పిత ఖాతాను ఎక్స్ తొలగించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News