ముంబైలో ఉండేవారు మరాఠీ నేర్చుకోనక్కర్లేదు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:44 AM
‘ముంబైకి ఒక ప్రత్యేక భాష అంటూ ఏమీ లేదు. నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఘట్‌కోపర్ భాష గుజరాతీ. గిర్‌గావ్‌లో కొందరు హిందీ మాట్లాడతారు.

ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషి వివాదాస్పద వ్యాఖ్య
ముంబై భాష.. మహారాష్ట్ర భాష.. మరాఠీయే
అసెంబ్లీ సాక్షిగా తేల్చిచెప్పిన సీఎం దేవేంద్ర ఫడణవీస్
ముంబై భాష మరాఠీయేననడంలో సందేహం లేదు
విమర్శల వెల్లువ నేపథ్యంలో భయ్యాజీ జోషీ వివరణ
ముంబయి, మార్చి 6: ‘‘ముంబైకి ఒక ప్రత్యేక భాష అంటూ ఏమీ లేదు. నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఘట్‌కోపర్ భాష గుజరాతీ. గిర్‌గావ్‌లో కొందరు హిందీ మాట్లాడతారు. అంచేత, ముంబైలో నివసించేవారు మరాఠీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు’’ అంటూ ఆరెస్సెస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! కేంద్ర ప్రభుత్వ హిందీ రుద్దుడుపై దక్షిణాది రాష్ట్రాలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ భాషలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో.. ముంబైలో ఉండేవారు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ భయ్యాజీ జోషీ వ్యాఖ్యానించడంపై మరాఠాలు భగ్గుమన్నారు. విపక్ష నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భయ్యాజీ జోషిపై రాజద్రోహం కేసు పెట్టాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేయగా.. ఇది దేశ ద్రోహమని శివసేన (ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ దుయ్యబట్టారు.
భయ్యాజీ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండడంతో.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ దీనిపై అసెంబ్లీ సాక్షిగా స్పందించారు. ‘‘భయ్యాజీ ఏమన్నారో నేను వినలేదు. కానీ.. ముంబై, మహారాష్ట్ర భాష మరాఠీయే. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ మరాఠీ భాష నేర్చుకోవాలి. మాట్లాడాలి. మహారాష్ట్ర సంస్కృతిలో, ఉనికిలో మరాఠీ విడదీయలేని భాగం. మరాఠీ నేర్చుకోవడం ఇక్కడి పౌరులందరి కర్తవ్యం’’ అని ఫడణవీస్ తేల్చిచెప్పారు. అదే సమయంలో తమ ప్రభుత్వం అన్ని భాషలనూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో భయ్యాజీ జోషి గురువారం ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ‘‘భారతదేశంలో రకరకాల భాషలు మాట్లాడేవారంతా కలిసి మెలిసి ఉంటారు. ముంబై కూడా అలాంటి ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ అని.. ఇక్కడ కూడా వివిధ భాషలు మాట్లాడేవారు కలిసి ఉంటారని నా ఉద్దేశం’’ అని వివరించారు. ముంబై భాష మరాఠీయేనని, అందులో సందేహమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తన మాతృభాష మరాఠీయేనని, తాను అన్ని భాషలనూ గౌరవిస్తానని చెప్పారు. ముంబైకి వచ్చేవారు మరాఠీ నేర్చుకోవాలని ఆశించడం సహజమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.