Hindi Ban Bill in Tamil Nadu: తమిళనాట హిందీ నిషేధం దుమారం
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:15 AM
తమిళనాట హిందీ భాషా వినియోగంపై నిషేధం విధిస్తున్నారని, ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో.....
బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతున్న స్టాలిన్
ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతుందంటూ వార్తలు
దేశ వ్యాప్తంగా పెల్లుబికిన వ్యతిరేకత, వెనక్కి తగ్గిన డీఎంకే
బిల్లు ప్రతిపాదన అవాస్తవమంటూ శాసనసభ కార్యదర్శితో వివరణ
చెన్నై, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తమిళనాట హిందీ భాషా వినియోగంపై నిషేధం విధిస్తున్నారని, ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతోందని బుధవారం జరిగిన ప్రచారంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. తమిళనాడులో మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, నూతన విద్యా విధానం అమలు అంశంలో కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం నడుస్తుండడం ఈ దుమారానికి మరింత ఊతం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటల్లో హిందీ భాషను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తీవ్ర చర్చ మొదలవ్వగా.. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దడానికి ప్రతిస్పందనగా ఈ బిల్లు తీసుకువస్తున్నట్లు డీఎంకే వర్గాలు ఆ వార్తలను సమర్థించాయి. అయితే, తాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయబోమని, దానికి కట్టుబడే చర్యలు ఉంటాయని డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. మరోపక్క, ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేను ఇరుకున పెట్టేందుకే సీఎం స్టాలిన్ హిందీ నిషేధం బిల్లును తెరపైకి తెచ్చారనే చర్చ కూడా జరిగింది. ఒక వేళ ఆ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడితే బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే.. బిల్లుకు మద్దతిస్తే బీజేపీని విభేదించినట్లవుతుంది. మద్దతు ఇవ్వకపోతే స్వరాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొనేది. అయితే, తమిళనాడులో హిందీ భాష వినియోగంపై నిషేధమనే వార్తలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో పునరాలోచనలో పడ్డ స్టాలిన్ ప్రభుత్వం వెనక్కితగ్గి హిందీ నిషేధ వార్తలను బుధవారం రాత్రి ఖండించింది. హిందీ భాష నిషేధానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారనే వార్తలను తీవ్రంగా తప్పు పట్టింది. అలాంటి బిల్లు ప్రతిపాదన ఏదీ తమకు అందలేదని తమిళనాడు శాసనసభ కార్యదర్శి స్పష్టం చేశారంటూ తమిళనాడు ప్రభుత్వ అధికారిక సామాజిక ఖాతా ‘టీఎన్ ఫ్యాక్ట్ చెక్’లో బుధవారం రాత్రి ప్రకటన చేసింది.