Share News

Election Commission: ఈసీ అధికారాలు అపరిమితమా?

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:26 AM

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)’పై వివాదం ముదురుతోంది.

Election Commission: ఈసీ అధికారాలు అపరిమితమా?

  • బిహార్‌లో ‘ఓటర్ల జాబితా ప్రక్షాళన’ పై తీవ్ర అభ్యంతరాలు

న్యూఢిల్లీ, జూలై 9: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)’పై వివాదం ముదురుతోంది. వలస వచ్చిన, పేద ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్రతోనే ఈ కార్యక్రమం చేపట్టిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326కు విరుద్ధమని కాంగ్రెస్‌, ఆర్జేడీ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. తప్పుల సవరణ కోసం, పౌరులుకానివారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు రాజ్యాంగ బద్ధంగానే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అయితే ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలేమీ లేవని.. ముఖ్యంగా బిహార్‌లో చేపట్టిన ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేదని నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ప్రకారం.. దేశంలో వయోజనులైన (18 ఏళ్లు నిండిన) పౌరులందరికీ ఎలాంటి కుల, మత, ప్రాంత, ఇతర భేదాలు, వివక్ష లేకుండా ఓటు హక్కు కల్పించాలి. ఇక ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 19, 20 ప్రకారం.. ఏదైనా నియోజకవర్గంలో నివాసం ఉంటున్నవారికి అక్కడ ఓటు హక్కు ఉంటుంది.


అయితే వారు కచ్చితంగా ఎప్పటికీ అదే చోట శాశ్వత నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉండదు. బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ దీనిని ఉల్లంఘించేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. మోహిందర్‌ సింగ్‌ గిల్‌ వర్సెస్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కేసు (1978)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎన్నికల సంఘానికి ఎన్ని విచక్షణాధికారాలు ఉన్నా సంబంధిత ఎన్నికలు, ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలో చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. ఎలాంటి చట్టాలు లేనప్పుడు మాత్రమే ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘం తన అధికారాలను వినియోగించుకోవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్‌ ప్రకారం.. ఎన్నికల సంఘం 4విధాలుగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టవచ్చు. ఒకటి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ముందు, రెండోది ఏవైనా ఉప ఎన్నికల ముందు, మూడోది ఏదైనా సంవత్సరంలో ఈసీ ఆదేశాల మేరకు, నాలుగోది ఏదైనా నియోజకవర్గం, లేదా అందులోని ఒక భాగంలో ప్రత్యేక సవరణ (స్పెషల్‌ రివిజన్‌) చేపట్టవచ్చు. ఈ చట్టం సెక్షన్‌ 14 ప్రకారం.. ఇందులో తొలి మూడు విధాల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధిత ఏడాది జనవరి 1వ తేదీ కటా్‌ఫగా ఉంటుంది. నాలుగో విధమైన ప్రత్యేక సవరణకు నిర్ణీత కటాఫ్‌ లేదు. అయితే చట్టంలో ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ అనే ప్రక్రియ లేదని, ప్రత్యేక సవరణ మాత్రమే ఉందని నిపుణులు అంటున్నారు. ఇక 2025 జనవరి 1వ తేదీని కటా్‌ఫగా పెట్టకుండా.. 2025 జూలై 1వ తేదీని పేర్కొనడమూ ఉల్లంఘనే అని స్పష్టం చేస్తున్నారు.


ఆధార్‌ ప్రాథమిక ఆధారమేమీ కాదు: యూఐడీఏఐ

దేశంలో ఆధార్‌ ఎప్పుడూ కూడా ప్రాథమిక గుర్తింపునకు ఆధారం కాదని యూఐడీఏఐ సీఈవో భువనేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దేశంలో భారీ సంఖ్యలో నకిలీ ఆధార్‌కార్డులు ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బిహార్‌లో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’లో ఆధార్‌ కార్డులను గుర్తింపుకోసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:26 AM