Share News

Caste Census: కులగణనపై కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

ABN , Publish Date - May 05 , 2025 | 05:24 AM

కులగణనపై కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించాలనే నిర్ణయంతో, రాహుల్‌ గాంధీ ఆశయంతో ఇప్పటికే తెలంగాణలో విజయవంతంగా జరిగిన కులగణనను దేశవ్యాప్తంగా వివరించడానికి సిద్ధమవుతోంది. మే 30 వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్‌ అధికారికంగా నిర్ణయించింది.

Caste Census: కులగణనపై కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

ప్రతి నియోజకవర్గంలో సంవిధాన్‌ బచావో ర్యాలీలు.. సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం

పర్యవేక్షణకు పీసీసీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు

జిల్లా స్థాయిలో పరిశీలకులు

పీసీసీల అధ్యక్షులకు అధిష్ఠానం దిశానిర్దేశం

తెలంగాణలో కులగణనను సమర్థంగా పూర్తిచేసిన విషయాన్ని దేశవ్యాప్తంగా వివరించనున్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): కులగణనపై ఇంటింటి ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. రాహుల్‌ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపడతామని ప్రకటించిందనే విషయాన్ని గ్రామస్థాయిలో వివరించేందుకు సిద్ధమవుతోంది. రాహుల్‌ హామీ మేరకు ఇప్పటికే తెలంగాణలో కులగణనను సమర్థవంతంగా పూర్తిచేశామనే విషయాన్ని దేశవ్యాప్తంగా వివరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కులగణనపై కాంగ్రెస్‌ వైఖరిని, బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకించిన తీరును దేశవ్యాప్తంగా ఇంటింటికీ చేరవేయాలని పీసీసీ అధ్యక్షులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మే 30 వరకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. కులగణనపై ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ప్రతి నియోజకవర్గంలో సంవిధాన్‌ బచావో ర్యాలీలు చేపట్టాలని, సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు పీసీసీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలని, జిల్లాస్థాయిలో పరిశీలకులను నియమించాలని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలకు సూచించింది. పాఱౠ్‌ఠ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల న్‌చార్జులు, సంఘాల బాధ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులకు సైతం సర్క్యులర్‌ కాపీలను పంపింది.


కులగణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తే... మోదీ ప్రభుత్వం ఎగతాళి చేసిందని, చివరికి ప్రజాస్వామ్య నిర్ణయానికి తలొగ్గి కులగణన ప్రకటన చేసిందని సర్క్యులర్‌లో తెలిపింది. పైవ్రేట్‌ విద్యా సంస్థల్లోనూ ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(5) అమలు చేయాలన్న డిమాండ్‌ను సంవిధాన్‌ బచావో ర్యాలీల్లో హైలెట్‌ చేయాలని తెలిపింది. ఈ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలను పీసీసీ అధ్యక్షులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. సామాజిక కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, దుకాణదారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, బహుజన వర్గాల క్రియాశీల భాగస్వామ్యంతో చౌపాల్‌ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. రాహుల్‌ గాంధీ పోషించిన నాయకత్వ పాత్రతో సహా, కాంగ్రెస్‌ పార్టీ చరిత్రాత్మక నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో వివరించాలని పేర్కొంది. బీజేపీ బహుజన వ్యతిరేక భావజాలాన్ని బహిర్గతం చేయాలని తెలిపింది. కాగా, ఏవో సాకులు చూపుతూ కులగణనను ఆలస్యం చేయొద్దని కేంద్రానికి కాంగ్రెస్‌ సూచించింది. పార్లమెంటులో చర్చించి పూర్తిస్థాయిలో బడ్జెట్‌ కేటాయించాలని, నిర్దిష్ట కాల పరిమితిని ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. కులగణన సర్వే కోసం సమగ్ర నివేదికతో కూడిన ప్రొఫార్మా రూపొందించాలని కోరింది.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 05:24 AM