Share News

Congress: త్రిశంకు స్వర్గంలోకి ఆర్థికం

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:56 AM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ‘వృద్ధికి ఏమైంది’ అనే పేరుతో కాంగ్రెస్‌ ఒక నివేదికను గురువారం విడుదల చేసింది.

Congress: త్రిశంకు స్వర్గంలోకి ఆర్థికం

చిరువ్యాపారులపై పన్నుల బాదుడు

కార్పొరేట్లకు మాత్రం మినహాయింపులు

ఆర్థిక రంగంపై కాంగ్రెస్‌ నివేదిక

న్యూఢిల్లీ, జనవరి 30: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. త్రిశంకుస్వర్గంలోకి నెడుతోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఆరోపించింది. దీని ఫలితంగా భారతదేశం ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడలేని విధంగా, తగిన స్థాయిలో ఉత్పాదకత జరపలేని దేశంగా, అసమానతల వ్యవస్థగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ‘వృద్ధికి ఏమైంది’ అనే పేరుతో కాంగ్రెస్‌ ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. ఏఐసీసీ పరిశోధన విభాగం చెయిర్‌పర్సన్‌ ఎంవీ రాజీవ్‌ గౌడ సారథ్యంలో రూపొందిన ఈ నివేదికను ఏఐసీసీ కార్యాలయంలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం విడుదల చేశారు. 2024-25లో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.4ు ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఇది సంతోషించాల్సిన విషయం కాదని.. యువ జనాభా అధికంగా ఉన్న మన దేశం వాస్తవానికి 8% వృద్ధిరేటును స్థిరంగా సాధించాలని ఈ నివేదికలో పేర్కొన్నారు.


‘శీఘ్రగతిన జరుగుతున్న సాంకేతిక మార్పులతో ఉద్యోగరంగంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో 6ు వృద్ధిరేటుతో యువతకు తగినన్ని ఉద్యోగాలు లభించవు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో తీవ్రమైన అసమానతలు కొనసాగుతాయి. దేశ జనాభాలో 2/3 వంతు మంది ప్రభుత్వం అందించే ఉచిత రేషన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. మరోవైపు, ప్రధానమంత్రి సన్నిహితులైన అతికొద్దిమంది కార్పొరేట్‌ సంపన్నులు మాత్రం తమ సంపద గుట్టలను వేగంగా పెంచుకుంటున్నారు. 2019లో కార్పొరేట్‌ కంపెనీలకు మోదీ ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను మినహాయింపులు ఇచ్చింది. దానికి ప్రతిగా కార్పొరేట్‌ రంగం పెట్టుబడులను పెంచి ఉద్యోగాలను సృష్టించే ప్రయత్నమే చేయలేదు. సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులను మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ మీద భారీ పన్నులతో, జీఎస్టీతో ప్రభుత్వం బాదుతోంది. తద్వారా దేశ ఆర్థికవ్యవస్థను మోదీ ప్రభుత్వం త్రిశంకుస్వర్గం వంటి మధ్య ఆదాయ ఉచ్చులోకి నెడుతోంది’ అని వివరించింది. కొవిడ్‌ సమయంలో మోదీ ఒక ప్రణాళిక అంటూ లేకుండా అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, ఆ తర్వాత కొంత పుంజుకున్నా అది ఏమాత్రమూ సరిపోదని తెలిపింది. ఈ వాస్తవాలను గుర్తించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని.. సమ్మిళిత అభివృద్ధి కోసమే తాము ఈ నిర్మాణాత్మక విమర్శ చేస్తున్నామని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:56 AM