Share News

Colombia India Relations: ఫలించిన భారత్‌ దౌత్యం

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:54 AM

ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా ఇచ్చిన అసంతృప్తి ప్రకటనను ఉపసంహరించుకుంది. భారత బృందం చేసిన దౌత్య పర్యటన విజయవంతం కాగా, కొలంబియా ఉగ్రవాదంపై భారత వైఖరికి మద్దతు తెలిపింది.

Colombia India Relations: ఫలించిన భారత్‌ దౌత్యం

పాకిస్థాన్‌ ఉగ్రవాదుల మృతిపై సంతాపాన్ని ఉపసంహరించుకున్న కొలంబియా

పహల్గాం దాడి, సిందూర్‌పై వాస్తవాలు తెలియజేసిన శశిథరూర్‌ బృందం

న్యూఢిల్లీ, మే 31: ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడుల తర్వాత అక్కడ మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ప్రకటనను కొలంబియా ఉపసంహరించుకుంది. వాస్తవాలు తెలుసుకొన్న ఆ దేశం ఉగ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న వైఖరికి బలమైన మద్దతు ఇస్తూ త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు ఉగ్రవాదంపై పాక్‌ వైఖరిని, ఆ దేశ కుతంత్రాలను వివరించేందుకు కొలంబియాకు వెళ్లిన ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని భారత బృందం దౌత్యం ఫలించింది. పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా విల్లావిసెన్సియోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొలంబియా వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అసంతృప్తి తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు. విల్లావిసెన్సియో మాట్లాడుతూ ‘భారత బృందం తెలియజేసిన అన్ని వివరాల పట్ల విశ్వాసంగా ఉన్నాం. ఉద్రిక్తతలు, వాస్తవ పరిస్థితి గురించి వివరణాత్మక సమాచారం తెలిసింది. కశ్మీర్‌లో ఏం జరిగిందో తెలుసుకున్నాం’ అని పేర్కొన్నారు. శశిథరూర్‌ మీడియాతో మాట్లాడుతూ మనల్ని అసంతృప్తికి గురిచేసిన ప్రకటనను కొలంబియా ఉపసంహరించుకుందని తెలిపారు. భారత్‌ వైఖరిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేయనుందని పేర్కొన్నారు. పహల్గాం దాడి వెనుక పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఉందనే దానికి భారత్‌ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాము స్వీయ రక్షణ హక్కును మాత్రమే ఉపయోగించుకున్నామని స్పష్టం చేశారు. కొలంబియా అనేక ఉగ్రదాడులను ఎదుర్కొన్న విధంగానే.. భారత్‌ కూడా 4 దశాబ్దాలుగా చాలా ఉగ్రదాడులను భరించిందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:54 AM