Tamil Nadu: రాష్ట్ర హక్కుల రక్షణ కోసం పోరాడదాం: స్టాలిన్
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:10 AM
రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం సాగించాల్సిన సమయం ఆసన్నమైందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం సాగించాల్సిన సమయం ఆసన్నమైందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. జాతీయ విద్యావిధానం పేరుతో నిర్బంధ హిందీ అమలు, నియోజకవర్గాల పునర్విభజన పేరిట లోక్‌సభ స్థానాలు తగ్గించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. శనివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ కార్యకర్తలకు స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు.
పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవటం తనకు అలవాటు అని.., అయితే ఈసారి హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రేరేపించాల్సిన అవసరమున్నందున పార్టీ శ్రేణులందరిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించకపోతే రాష్ట్రంలో హిందీ రాజ్యమేలి తమిళభాష పత్తాలేకుండా పోతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, త్రిభాషా విద్యావిధానం అత్యంత అవసరమని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్నారు.