Share News

CM Stalin: సీఎం స్టాలిన్‌ ఆగ్రహం.. గవర్నర్‌ తీరు ఏం మారలేదు..

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:41 AM

సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహారశైలి మారలేదని, కలైంజర్‌ కరుణానిధి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంకా పెండింగ్‌లోనే ఉంచారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Stalin: సీఎం స్టాలిన్‌ ఆగ్రహం.. గవర్నర్‌ తీరు ఏం మారలేదు..

- తంజావూరు సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం

- పెండింగ్‌లో కలైంజర్‌ వర్సిటీ బిల్లు

చెన్నై: సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహారశైలి మారలేదని, కలైంజర్‌ కరుణానిధి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఇంకా పెండింగ్‌లోనే ఉంచారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. తంజావూరులో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ జిల్లాలో రూ.325.96 కోట్లతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.309.48 కోట్లతో చేపట్టనున్న కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. 2.25 లక్షలమంది లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలను ఆయన పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటూ, వారికి పథకాలు అమలు చేసి పేరుతెచ్చుకుంటున్న డీఎంకే ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక అన్నాడీఎంకే నేత ఎడప్పాడి అదేపనిగా విమర్శలు చేస్తుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌లా గవర్నర్‌ వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలకు అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. తంజావూరుకు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి రాజకీయపరంగా, సాహిత్యపరంగా విడదీయలేని అనుబంధం ఉండేదని, ఆ కారణంగానే ఇక్కడ కలైంజర్‌ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించి పంపితే గవర్నర్‌ ఇప్పటివరకూ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.


nani1.2.jpg

తన సుదీర్ఘమైన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నానని, మీసా చట్టానికే తలవంచిన ఈ స్టాలిన్‌ ఎన్ని సవాళ్లు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలడన్నారు. ప్రాచీన కాలం ధాన్యం నూర్పిడికి ఎద్దుల బండ్లు చాలవని, ఏనుగులతో ధాన్యాన్ని నూర్పిడి చేసిన నగరంగా తంజావూరు కీర్తి చెందిందని, కనుకనే ఈ ప్రాంతాన్ని తమిళ ధాన్యాగారంగా పిలుస్తారని సీఎం పేర్కొన్నారు.


15నుంచి గృహిణుల నగదు పధకం దరఖాస్తుల స్వీకరణ...

ద్రావిడ తరహా డీఎంకే పాలనలో మహిళాభ్యుదయానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, వాటిలో గృహిణుల ఖాతాలో ప్రతినెల రూ.1000ల జమచేసే కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు పధకానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఆ పథకం కింద రెండు విడతలుగా దరఖాస్తులు స్వీకరించి లక్షలాదిమంది గృహిణుల ఆర్థిక స్థోమత పెంచామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా లబ్దిపొందని గృహిణుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు జూలై 15 నుండి ‘ఉంగలుడన్‌ స్టాలిన్‌’ (మీతో స్టాలిన్‌) పేరుతో రాష్ట్రమంతటా 10వేలకు పైగా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామన్నారు.


ఈ శిబిరాలలో స్వీకరించే దరఖాస్తులపై 45 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని స్టాలిన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, శివశంకర్‌, కొవి చెళియన్‌, అన్బిల్‌ మహేష్‌, మెయ్యనాథన్‌, ఎంపీలు తిరుచ్చి శివా, కల్యాణసుందరం, మురసొలి సుధ, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌, ఎమ్మెల్యేలు దురై చంద్రశేఖరన్‌, అన్బళగన్‌, నీలమేఘం, అన్నాదురై, అశోక్‌కుమార్‌, కార్పొరేషన్‌ మేయర్లు సన్‌ రామనాఽథన్‌, శరవణన్‌, జిల్లా కలెక్టర్‌ ప్రియంకా పంకజం తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 11:42 AM