Share News

Justice Gavai: రాజ్యాంగంతోనే భారత్‌ సమైక్యం సుదృఢం

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:57 AM

సీజేఐ జస్టిస్ గవాయ్ భారతదేశం ఎటువంటి సంక్షోభంలోనూ సమైక్యంగా ఉండేందుకు రాజ్యాంగం కీలకమైన రక్షణను కల్పిస్తున్నదన్నారు. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి ఆత్మలాగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

 Justice Gavai: రాజ్యాంగంతోనే భారత్‌ సమైక్యం సుదృఢం

ప్రయాగ్‌రాజ్‌, మే 31: ఎటువంటి సంక్షోభం తలెత్తినా భారతదేశం సమైక్యంగా, సుదృఢంగా ఉండేలా రాజ్యాంగం తగిన జాగ్రత్తలను పొందుపరిచిందని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. శనివారం అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదుల చాంబర్లతోపాటు బహుళ అంతస్తుల పార్కింగ్‌ సదుపాయాన్ని జస్టిస్‌ గవాయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం తర్వాత భారత్‌ అభివృద్ధిపథంలో కొనసాగిందంటే అది రాజ్యాంగం వల్లనేనన్నారు. మన పొరుగుదేశాల పరిస్థితి ఎలా ఉందో కనిపిస్తూనే ఉందన్నారు. రాజ్యాంగం అమలైన ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావటానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఎంతగానో తోడ్పడ్డాయని తెలిపారు. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య వైరుధ్యం తలెత్తితే ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యం ఇవ్వాలని 1973 ముందు వరకూ సుప్రీంకోర్టు భావించేదని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. 1973లో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని పేర్కొంటూనే.. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి ఆత్మవంటివని ఆ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. రాజ్యాంగం అనే బంగారు రథానికి ఇవి రెండు చక్రాల వంటివని, ఏ చక్రాన్ని ఆపినా రథం ఆగిపోతుందని జస్టిస్‌ గవాయ్‌ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:57 AM