Constitution Supremacy: రాజ్యాంగమే సుప్రీం
ABN , Publish Date - May 19 , 2025 | 05:03 AM
రాజ్యాంగమే దేశంలో సర్వోన్నతమైనదని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. పార్లమెంటు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పరం గౌరవించుకుంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఈ వ్యవస్థల్లో ఏదీ ఎక్కువా.. తక్కువా కాదు
ప్రజాస్వామ్యంలో 3 స్తంభాలూ సమానమే: సీజేఐ జస్టిస్ గవాయ్
ముంబై, మే 18: దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదని.. భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు.. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడూ సమానమేనని అన్నారు. ఇవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని.. పరస్పరం గౌరవించుకోవాలని స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమిస్తోందని పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 14న 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టి్‌సగా ప్రమాణం చేసి తొలిసారి ముంబై వచ్చిన ఆయన్ను మహారాష్ట్ర-గోవా బార్ కౌన్సిల్ ఆదివారం సత్కరించింది. రాష్ట్ర న్యాయవాదుల సదస్సు కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపం జోలికి అది వెళ్లడానికి వీల్లేదన్నారు. ‘రాజ్యాంగం సర్వోన్నత అధికారం, చట్టపాలన, న్యాయవ్యవస్థకున్న స్వేచ్ఛ వంటివాటిని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు సవరించడం గానీ, రద్దు చేయడం గానీ చేయజాలదు.

రాజ్యాంగ మౌలిక నిర్మాణం దృఢతరమైనది. దాని మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడూ సమానమే. కలిసిమెలిసి పనిచేయాలి’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తిని కావడం సంతోషకరమని తెలిపారు. ‘రాజ్యాంగంలోని మూడు స్తంభాలూ తమ తమ పరిధులకు లోబడి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాసన, న్యాయ్యవ్యవస్థలు చేసిన పలు చట్టాల కారణంగానే సామాజిక-ఆర్థిక న్యాయం భావన నెరవేరుతుంది’ అని ఆకాంక్షించారు. ఆయన ఇచ్చిన 50 కీలక తీర్పుల సంకలనాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వాటిలో కొన్నిటిని జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా తానిచ్చిన తీర్పు గురించి వివరించారు. ‘నివాస హక్కు ప్రాఽథమిక హక్కు. ఏ వ్యక్తి అయినా ఏదైనా కేసులో నిందితుడైనా.. దోషిగా నిర్ధారణ అయినా.. అతడి కుటుంబ నివాసం చట్టబద్ధమైనదైతే.. దానిని తొలగించడానికి, కూల్చడానికి వీల్లేదు. చట్ట పాలనను అనుసరించి వ్యవహరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ దత్తా, బోంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే తదితరులు పాల్గొన్నారు.న్నారు.
‘142’ ప్రస్తావనపై చర్చ..
మహారాష్ట్ర సీఎస్, డీజీపీల ప్రోటోకాల్ ఉల్లంఘనపై జస్టిస్ గవాయ్ ఆర్టికల్ 142ను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. చట్టసభలు పంపిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి లోబడి ఆమోదించాల్సిందేనని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ తీవ్రంగా విమర్శించారు. ఇంకోవైపు.. రాష్ట్రపతిని సైతం నిర్దేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉందా.. రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ తమ విధుల నిర్వహణలో ఏ కోర్టుకూ జవాబుదారీ కాదని రాజ్యాంగంలోని 361వ అధికరణ చెబుతోందని.. 201వ అధికరణ కింద విచక్షణాధికారాలు ఉన్న రాష్ట్రపతికి న్యాయస్థానాలు గడువు నిర్దేశించవచ్చా.. తదితర 14 ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుప్రీంకోర్టును వివరణ కోరారు. ఇది కోర్టును ధిక్కరించడమేనంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జస్టిస్ గవాయ్ 142 అధికరణపై చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది.
సీఎస్, డీజీపీ డుమ్మా..
ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీజేఐ ఆగ్రహం
సీజేఐ సన్మాన కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానీ, డీజీపీ గానీ, ముంబై పోలీసు కమిషనర్ గానీ హాజరు కాలేదు. దీనిపై సదస్సులో జస్టిస్ గవాయ్ తీవ్రంగా స్పందించారు. ‘ఒక మహారాష్ట్రీయుడు భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టి.. తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే.. హాజరు కావడం సముచితమని మహారాష్ట్ర సీఎస్, డీజీపీ, ముంబై కమిషనర్‌కు అనిపించలేదంటే.. ఇది కరెక్టో కాదో వారే ఆలోచించుకోవాలి. న్యాయవ్యవస్థను ఇతర వ్యవస్థలు గౌరవించడానికి సంబంధించిన అంశమిది. ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండాలని నేను పట్టుబట్టడం లేదు. అయితే ఓ వ్యవస్థ లేదా విభాగాధిపతి.. తొలిసారి రాష్ట్రానికి వస్తే.. అందునా ఆయన అదే రాష్ట్రానికి చెందినవారైతే.. ఇలా వ్యవహరించడం సముచితమో కాదో వారు ఆలోచించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల జోలికి నేను వెళ్లను. అయితే ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందనే దీనిని ప్రస్తావించాను. అదే మా న్యాయమూర్తుల్లో ఎవరైనా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే.. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలిచ్చే 142వ అధికరణపై చర్చలు పెట్టేస్తారు’ అని గవాయ్ ఆక్షేపించారు. వ్యక్తులు తప్పనిసరిగా తన ముందు హాజరవ్వాలని ఆదేశాలిచ్చే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఈ అధికరణ ఇచ్చింది. బార్‌కౌన్సిల్ సన్మానం తర్వాత బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మారక చిహ్నమైన చైత్యభూమిని సీజేఐ సందర్శించారు. అప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలియడంతో మహారాష్ట్ర సీఎస్ సుజాతా సౌనిక్, డీజీపీ రష్మీ శుక్లా, ముంబై పోలీసు కమిషనర్ దేవేన్ భారతి హడావుడిగా అక్కడకు చేరుకు
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి