Share News

Chitradurga Bus Accident: పెను విషాదం.. చావులోనూ వీడని స్నేహ బంధం..

ABN , Publish Date - Dec 26 , 2025 | 07:39 PM

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హాసన్‌కు చెందిన నవ్య, మానస కూడా ఉన్నారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

Chitradurga Bus Accident: పెను విషాదం.. చావులోనూ వీడని స్నేహ బంధం..
Chitradurga Bus Accident

కర్ణాటకలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిన్న (గురువారం) ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 48పై ఓ లారీ హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళుతోంది. చిత్రదుర్గ జిల్లా, హిరియూర్ తాలూకాలోని గొర్లతు క్రాస్ వద్ద అతి వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి, మరొక వైపు నుండి వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో స్లీపర్ కోచ్ బస్సు రోడ్డు మధ్యలో మంటల్లో చిక్కుకుంది. బస్సుతో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. 17 మంది సజీవదహనమయ్యారు.


మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హాసన్‌కు చెందిన నవ్య, మానస కూడా ఉన్నారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నవ్య తండ్రి మంజప్ప ఈ సంఘటనపై మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. వారి స్నేహం గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మంజప్ప చెబుతున్న దాని ప్రకారం.. నవ్య, మానస ప్రాణ స్నేహితులు. ఒకే ప్లేటులోనే తినేవారు. ఎప్పుడూ ఒకే రకం దుస్తులు ధరించేవారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఒకే చోట పని కూడా చేస్తున్నారు.


ఇద్దరూ కలిసి గత రెండేళ్ల నుంచి బెంగళూరులో పని చేస్తున్నారు. గురువారం ఆఫీస్‌కు సెలవు పెట్టి నవ్య, మానస, మిలన్(ఇద్దరికీ స్నేహితురాలు) ప్రైవేట్ బస్సులో ఊరికి బయలు దేరారు. బస్సు బయలుదేరడానికి ముందు నవ్య తన తండ్రికి ఫోన్ చేసింది. ఓ అరగంట పాటు మాట్లాడింది. బస్సు శివ మొగ్గ బయలు దేరిన కొన్ని గంటలకే ఊహించని విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ప్రాణ స్నేహితులైన నవ్య, మానస ప్రాణాలు కోల్పోయారు. కాలి బూడిద అయ్యారు. మిలన్ ప్రాణాలతో బయటపడింది. ప్రమాదంలో కాలిపోయిన వారి శవాలు గుర్తించడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రియుడిని బెదిరించిన ప్రియురాలు.. కట్ చేస్తే ఊహించని దారుణం..

మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..

Updated Date - Dec 26 , 2025 | 07:39 PM