Share News

J-35A fighter jets: చైనా చౌక బేరం

ABN , Publish Date - May 23 , 2025 | 04:42 AM

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావంతో చైనా జే-35ఏ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు సగం ధరకే ఇవ్వనుందని సమాచారం. పాక్‌ సాయంతో ఆయుధాల మార్కెట్‌లో తన స్థానాన్ని బలపరచాలనే వ్యూహంతో చైనా ఈ ఆఫర్‌ ఇచ్చినట్టు నిపుణుల అభిప్రాయం.

J-35A fighter jets: చైనా చౌక బేరం

తన జే-35ఏ ఫైటర్లపై పాక్‌కు 50ు రాయితీ!

మొత్తం 30 విమానాల కొనుగోలుకు ఒప్పందం

ఈ ఏడాది ఆగస్టులోనే అందనున్న తొలి బ్యాచ్‌

భారత్‌పై దాడులకు ‘బహుమతి’ అంటూ ఆఫర్‌?

కానీ ఆయుధాల అమ్మకాలు పెంచుకునే ఎత్తుగడ అని అంటున్న రక్షణ రంగ నిపుణులు

న్యూఢిల్లీ, మే 22: ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాల నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా తమ ‘జే-35ఏ’ ఐదోతరం యుద్ధ విమానాలను సగం ధరకే పాకిస్థాన్‌కు ఇస్తామని ఆఫర్‌ చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్‌-35, రష్యాకు చెందిన సుఖోయ్‌-57లతో పోటీపడగలదని చైనా చెబుతున్న ఈ ఫైటర్‌ జెట్ల కొనుగోలు కోసం పాక్‌-చైనా మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మొత్తం 30 విమానాలకు ఆర్డర్‌ చేయగా.. అందులో తొలి బ్యాచ్‌ ఈ ఏడాది ఆగస్టులోనే పాక్‌కు అందనున్నాయి. దీనికి సంబంధించి చెల్లింపులు, ఇతర అంశాలపై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌దార్‌ ఇటీవలే చైనా రక్షణ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు కూడా. ఈ క్రమంలోనే.. జే-35ఏ ఫైటర్‌ జెట్లపై 50శాతం డిస్కౌంట్‌ ఇస్తామని, అది కూడా చిన్న వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తామని చైనా ఆఫర్‌ చేసినట్టు సమాచారం. దీనిని చైనా, పాక్‌ మధ్య స్నేహనికి గుర్తుగా, భారత్‌ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు ‘బహుమతి’గా పేర్కొన్నట్టు తెలిసింది. ఈ అంశాలతో పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. పాకిస్థాన్‌లో పౌర, మిలటరీ సదుపాయాల కల్పన కోసం 25 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.14 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని కూడా హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి.


ఆయుధాలు అమ్ముకునే ఎత్తుగడ!

పాకిస్థాన్‌కు సగం ధరకే జే-35ఏ ఫైటర్లను చైనా ఇవ్వడం వెనుక ఆయుధాలు అమ్ముకునే ఎత్తుగడ దాగి ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. చైనా అఽధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు అభివృద్ధి చేసినా, అమ్మకానికి పెట్టినా.. వాటి పనితీరుపై సందేహాలతో కొనుగోలు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉంది. చాలా దేశాలు అమెరికా, రష్యా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌ తదితర దేశాల యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపైనే ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌ను ముందు పెట్టి.. తన ఫైటర్లు, ఆయుధాలను అమ్ముకునేందుకు చైనా ప్రయత్నం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. జే-35ఏ ఫైటర్లను వీలైనంత త్వరగా పాకిస్థాన్‌కు అందించి.. అవి యుద్ధాలకు సిద్ధమనే సంకేతాలు ఇవ్వడం, వాటి పనితీరుపై నమ్మకం కలిగించడం కోసం చైనా ప్రయత్నాలు చేస్తోందని వివరిస్తున్నారు. ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌, ఆగ్నేయాసియా దేశాలకు జే-35ఏ ఫైటర్లను అమ్మేందుకు చైనా ప్రయత్నిస్తోందని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:43 AM