Chhattisgarh; నక్సల్ ప్రభావిత బస్తర్‌కు త్వరలో రైలు!
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:44 AM
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 27: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి. తెలంగాణలోని కొత్తగూడెంను ఛత్తీస్‌గఢ్‌లోని కిరందుల్‌ను కలుపుతూ 160 కి.మీ.ల రైల్వేలైను నిర్మాణానికి జరుపుతున్న లొకేషన్ సర్వే తుది అంకానికి చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైల్వేలైనులో అత్యధిక భాగం (138 కి.మీ.లు) ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంటుంది. ఆ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్‌లోని సుక్మా, దంతేవాడ, బీజాపూర్ జిల్లాలు ఈ రైల్వే లైను పరిధిలోకి రానున్నాయి.
దీంతో స్థానిక ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీ, గిరిజనులకు విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో.. అత్యాధునిక లైడార్ టెక్నాలజీతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం రైల్వే విభాగం.. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తుంది. అది ఆమోదం పొందిన తర్వాత రైల్వే లైను నిర్మాణం మొదలవుతుంది.